Begin typing your search above and press return to search.

విశాల్ కు షాకిచ్చిన ఆ ఇద్దరు

By:  Tupaki Desk   |   22 Nov 2018 7:49 AM GMT
విశాల్ కు షాకిచ్చిన ఆ ఇద్దరు
X
నడిగర్ సంఘం సెక్రటరీగా కీలక బాధ్యతలు వహిస్తూనే మరోవైపు తన సినిమాలు తాను చేసుకునే విశాల్ కు కొత్త తలనెప్పి మొదలైంది. సంఘంలో ముందు నుంచి అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించిన నిర్మాత ఆర్కె సురేష్-నటుడు ఉదయా ఇద్దరు వ్యక్తిగత కారణాలు చూపుతూ తమ సభ్యత్వానికి రాజీనామా చేసారు. పైకి ఇది మాములుగా కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక మరో కథ ఉందట.

ఆ మధ్య డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మెడలు వంచేందుకు షూటింగ్స్ మొత్తం ఆపేసి థియేటర్లు మూసేసి ఏకబికిన యాభై రోజుల దాకా కోలీవుడ్ సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దాని తర్వాత నిర్మాతల సమాఖ్య కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏదైనా సినిమా విడుదల చేయాలి అంటే ముందు సంఘానికి తెలియ పరిస్తే షూటింగ్ పూర్తయిన వరుస ప్రకారం రిలీజ్ డేట్లు కేటాయించే పద్ధతి తీసుకొచ్చారు. నా ఇష్టం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాను అంటే తమిళనాడులో కుదరదు. దాని ప్రకారం ఆర్కె సురేష్ బిల్లా పాండిని విజయ్ సర్కార్ తో పాటు సమాంతరంగా నవంబర్ 6నే విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో విజయ్ తుఫాను ముందు ఇది నామరూపాల్లేకుండా పోయింది.

తనకు ఆ తేదీ వద్దు మొర్రో అని మొత్తుకున్నా రూల్స్ అని చెప్పి ఆ డేట్ ఇవ్వడం వల్ల సరైన థియేటర్లు దొరక్క ఆర్థికంగా చాలా నష్టపోయాను అని ఆర్కె సురేష్ ఆరోపణ. ఇక ఉదయా నటించిన ఉత్తరవు మహారాజా మొన్న శుక్రవారం రిలీజయింది. నాలుగైదు సినిమాలతో పాటు గంపగుత్తగా డేట్ ఇవ్వడంతో పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు, పోటీగా ఉన్న జ్యోతిక సినిమా సూపర్ హిట్ అయ్యింది. వద్దని చెప్పినా ఇష్టం లేని డేట్లు ఇవ్వడం వల్లే నష్టపోయామని భావించి ఈ ఇద్దరు విశాల్ తో ఉన్న స్నేహాన్ని పక్కన పెట్టేసి రాజీనామా ఇచ్చేసారు. ఇంకా దీని గురించి విశాల్ రెస్పాండ్ అవ్వలేదు. అయోగ్య పోస్టర్ వివాదం వేడిగా ఉండగానే ఇదొకటి చుట్టుకుంది