Begin typing your search above and press return to search.

నా కెరియర్లోనే బెస్ట్ మూవీ ఇది: రీతూ వర్మ

By:  Tupaki Desk   |   24 Oct 2021 4:08 AM GMT
నా కెరియర్లోనే బెస్ట్ మూవీ ఇది: రీతూ వర్మ
X
ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే సినిమాలకు ఎప్పుడూ కూడా ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చినప్పుడే ఒక సినిమాకి విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వరుడు కావలెను' సినిమా రెడీ అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్ లో, ఈ సినిమాకి సంబంధించిన 'సంగీత్'ను నిర్వహించారు. ఈ సినిమాలో కథానాయికగా అలరించిన రీతూ వర్మ మాట్లాడింది.

"ఈ సినిమాలో నాకు ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా అంతా కూడా ప్రేమ .. పెళ్లి .. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. అందువలన ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది. ఇది నా కెరియర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది. దర్శకురాలు లక్ష్మీసౌజన్య ఈ సినిమాను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఒక ఫీమేల్ డైరెక్టర్ గా ఆమెను చూడలేము. ఈ సినిమా కోసం ఆమె అంతగా కష్టపడ్డారు. ఆమె కష్టానికి తగిన సక్సెస్ లభిస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఇక నాగశౌర్య విషయానికి వస్తే, ఆయన సహకారం వల్లనే నేను నా పాత్రను మరింత బాగా చేయగలిగాను.

ఇక ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్టుగా పూజ రావడం నాకు మరింత సంతోషాన్ని కలిగించిన విషయం. చీఫ్ గెస్టుగా ఒక హీరోయిన్ ను పిలవడం చాలా రేర్. అలాంటి అవకాశం పూజకి దక్కింది. అందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. మళ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుసుకుందాం .. అలాగే 29వ తేదీన థియేటర్లలో కలుసుకుందాం" అంటూ ముగించింది. ఇక ఇటీవలే రీతూ వర్మ 'టక్ జగదీశ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమాలో ఆమెకి మంచి రోల్ పడింది. ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆ తరువాత సినిమాగా వస్తున్న 'వరుడు కావలెను'పై ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. నదియా ఒక కీలకమైన పాత్రను పోషించగా, మురళీశర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ .. విశాల్ చంద్రశేఖర్ అందించిన బాణీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ తరువాత సినిమాగా ఆమె 'ఒకే ఒక జీవితం' చేస్తోంది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి, శ్రీకార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.