Begin typing your search above and press return to search.

‘గురు’ చిచ్చరపిడుగు కథేంటి?

By:  Tupaki Desk   |   1 April 2017 5:58 AM GMT
‘గురు’ చిచ్చరపిడుగు కథేంటి?
X
‘ఇరుదు సుట్రు’ సినమాను తెలుగులో ‘గురు’గా రీమేక్ చేసిన సుధ కొంగర.. హీరో పాత్రకు వెంకటేష్ ను తీసుకుంది. కానీ హీరోయిన్ పాత్ర కోసం మాత్రం వేరే అమ్మాయిని చూడలేదు. ఒరిజినల్లో నటించిన రితికా సింగ్ నే తెలుగులోనూ నటింపజేసింది. మరి ఆ పాత్రను మనకు పరిచయమున్న వేరే నటితో ఎందుకు చేయించలేదు అంటే.. ఆమెకు ఆ ఆప్షన్ లేదు. రితిక తప్ప ఆ పాత్ర చేయడానికి ప్రత్యామ్నాయమే లేదు మరి. రితిక తప్ప ఆ పాత్ర ఇంకెవరూ చేయలేరంటే చేయలేరు. సినిమా చూసిన ఎవ్వరైనా ఈ మాట ఒప్పుకోక తప్పదు. నిజంగా ఓ బస్తీ అమ్మాయి బాక్సింగ్ నేర్చుకుని.. ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయితే ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది రితికా ఇందులో. ఒరిజినల్లో ఎంత బాగా చేసిందో.. తెలుగులో కూడా అలాగే అదరగొట్టేసింది రితికా. ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువ. రితికా నేపథ్యం కూడా ఆసక్తికరమే.

స్వయంగా బాక్సింగ్ నేపథ్యం ఉండటం వల్లే రితికా ఆ పాత్రను అంత బాగా చేసింది. ముంబయికి చెందిన రితికకు చిన్నప్పట్నుంచి మార్షల్ ఆర్ట్స్ అనుభవం ఉంది. కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుంది. 2009 ఆసియా ఇండోర్ గేమ్స్ లో ఆమె పోటీ పడింది కూడా. ఆ తర్వాత శిల్పా శెట్టి భర్త మొదలుపెట్టిన సూపర్ ఫైట్ లీగ్ లోనూ తలపడిందామె. మహిళల బాక్సింగ్ నేపథ్యంలో సుధ కొంగర ‘ఇరుదు సుట్రు’ సినిమా తీయాలనుకున్నాక.. లీడ్ రోల్ కోసం చాలామంది అమ్మాయిల్ని పరిశీలించింది. ఆ క్రమంలోనే రాజ్ కుంద్రా ద్వారా.. రితిక గురించి తెలిసి ఆమెను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకుంది. అలా బాక్సింగ్ నుంచి అనుకోకుండా సినిమాల వైపు వచ్చింది రితిక. నటనలో ఏమాత్రం అనుభవం లేకపోయినా సరే.. సుధ దగ్గర చాన్నాళ్ల పాటు ట్రైనింగ్ తీసుకుని రాటుదేలింది. ‘ఇరుదు సుట్రు’లో అద్భుతంగా నటించి మెప్పించింది. ఇప్పుడు ‘గురు’తో తెలుగు ప్రేక్షకులనూ కట్టిపడేస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/