Begin typing your search above and press return to search.

కొడుకు సినిమా ఫ్లాపైందని వాళ్లను తిట్టిపోశాడు

By:  Tupaki Desk   |   24 July 2017 11:41 AM GMT
కొడుకు సినిమా ఫ్లాపైందని వాళ్లను తిట్టిపోశాడు
X
‘యే జవాని హై దివాని’ టైంలో రణబీర్ కపూర్ జోరు చూసి అతను ఖాన్ త్రయానికి పోటీ ఇచ్చే రేంజికి వెళ్లిపోతాడని బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ కుర్రాడు ఆ తర్వాత అంచనాల్ని అందుకోలేకపోయాడు. వరుసబెట్టి ఫ్లాపుల మీద ఫ్లాపులిస్తూ రేసులో వెనుకబడిపోయాడు. బేషారం.. బాంబే వెల్వెట్.. రాయ్ లాంటి డిజాస్టర్లు రణబీర్ ను బాగా వెనక్కి లాగేశాయి. రెండేళ్ల కిందట వచ్చిన ‘తమాషా’.. గత ఏడాది రిలీజైన ‘యే దిల్ హై ముష్కిల్’ కూడా అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో అతడి ఆశలన్నీ ‘జగ్గా జాసూస్’ మీదే నిలిచాయి. కానీ ఈ సినిమా కూడా ఫట్టుమంది. దర్శకుడు అనురాగ్ బసు ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దామని చూశాడు కానీ.. అతడి ప్రయత్నం తేడా కొట్టేసింది.

‘జగ్గా జాసూస్’ ఫ్లాపవడం రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆయన దర్శకుడు అనురాగ్ బసు మీద మండి పడ్డాడు. అతను బాధ్యతా రాహిత్యంతో సినిమా తీశాడని.. అనురాగ్ అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయలేకపోవడం దెబ్బ తీసిందని విమర్శించాడు. సంగీత దర్శకుడు ప్రీతమ్ ను కూడా ఆయన వదల్లేదు. అతడి మ్యూజిక్ కూడా సినిమాకు మైనస్ అయిందన్నాడు. అనురాగ్ సినిమా రిలీజవుతున్న వారం కూడా మిక్సింగ్ చేస్తూ గడిపాడని.. సంగీత దర్శకుడు ప్రీతమ్ కూడా అలాగే పనిచేశాడని.. ఇప్పటి దర్శకులు విడుదలకు ముందు సినిమా చూపించి అభిప్రాయం తీసుకోవడానికి ఇష్టపడట్లేదని.. వాళ్లేదో అద్భుతాలు చేస్తున్నట్లు ఫీలైపోతున్నారని రిషి కపూర్ విమర్శించాడు. ‘జగ్గా జాసూస్’లో 20 నిమిషాలు ఎడిట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డాడు.