Begin typing your search above and press return to search.

వర్మ నుండి ఆ సీక్వెల్ సినిమానా..?

By:  Tupaki Desk   |   3 Jun 2020 2:30 PM GMT
వర్మ నుండి ఆ సీక్వెల్ సినిమానా..?
X
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసే సినిమాల కంటే ముందు ఆయన నిర్ణయాలే ఎక్కువ సంచలనాలు సృష్టిస్తాయి. ఆర్జీవీ సినిమా రిజల్ట్స్ గురించి పట్టించుకోడు. తన కంటెంట్ ప్రేక్షకులకు చేరిందా లేదా అనే విషయం పై ఎక్కువగా దృష్టి పెడుతుంటాడు. ఇక వర్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. అదేంటంటే త్వరలోనే తనొక హారర్ సినిమా చేస్తానని చెప్పాడు. ఆర్జీవీ సినీ జానర్ లలో అన్నింటిని టచ్ చేసి వదిలేసాడు. మెయిన్ గా అసలైన హారర్ సినిమాలను ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం చేసిన ఫస్ట్ డైరెక్టర్ వర్మ అనే చెప్పాలి. అప్పట్లోనే రాత్రి, భూత్ వంటి సినిమాలు వర్మ కెరీర్లో మంచి హిట్స్ గా నిలిచాయి. కానీ ఆ తర్వాత ఇన్నేళ్లుగా మళ్లీ ఆ జానర్ టచ్ చేయలేదు. ఆ మధ్య హారర్ మూవీస్ కొన్ని చేసినప్పటికీ అవి ఆకట్టుకోలేక పోయాయి.

ఎప్పటినుండో వర్మ నుంచి ఒక మంచి హారర్ మూవీ ఆశిస్తున్నారు ప్రేక్షకులు. తెలుగులో వర్మ మార్క్ చూసి చాలా కాలం అవుతోంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు.. తప్పకుండా ఒక హారర్ మూవీ త్వరలో చేస్తానని చెప్పాడు. అంతేగాక భయం అనే టైటిల్ తో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ఒక క్లారిటీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి మాత్రం చెప్పలేదు. కానీ వర్మ అన్నాడంటే ఖచ్చితంగా తీసి చూపిస్తాడు అని ఫ్యాన్స్ నమ్మకం. కానీ ఇండస్ట్రీలో కొందరు మాత్రం వర్మ చెప్పిన సినిమాలే సరిగ్గా చేయడు.. అలాంటిది హారర్ ఏం చేస్తాడు అని అనుకుంటున్నారట. వర్మ మాటలు నమ్మడం కష్టమే అంటున్నారు. ఇదిలా ఉండగా వర్మ తీయబోయే సినిమా 1996లో విడుదలైన దెయ్యం సినిమాకు సీక్వెల్ గా రాబోతుందని సమాచారం. ఆ సీక్వెల్ కే భయం అనే టైటిల్ పెట్టినట్లు టాక్. మరి వర్మ మాటలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే!