Begin typing your search above and press return to search.

ఆర్జీవీ వైర‌ల్ వీడియోః ప్ర‌కృతిని నాశ‌నం చేసినందుకేన‌ట‌!

By:  Tupaki Desk   |   19 May 2021 8:14 PM IST
ఆర్జీవీ వైర‌ల్ వీడియోః ప్ర‌కృతిని నాశ‌నం చేసినందుకేన‌ట‌!
X
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఈ మధ్య వ‌రుస‌గా సామాజిక అంశాల‌పై స్పందిస్తున్నారు. ప్ర‌త్యేకంగా కొవిడ్ క‌ల్లోలంపై కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని నేరుగా అటాక్ చేశారు. కుంభ‌మేళాకు అవ‌కాశం ఇవ్వ‌డం, ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్లే.. దేశంలో క‌రోనా ఈ స్థాయిలో విజృంభిస్తోంద‌ని ఫొటోలు పెట్టి మ‌రీ విమ‌ర్శ‌లు చేశారు.

ఆ త‌ర్వాత దేశంలో న‌మోద‌వుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌పైనా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మోడీ త‌న‌ను మించిన హార‌ర్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ అని, క‌రోనా వేవ్ మ‌రోసారి వ‌స్తే.. త‌న‌కు మ‌ర‌ణాల లెక్క‌లు రాసే గుమాస్తా ఉద్యోగమైనా ఇవ్వాల‌ని ఎద్దేవా చేశారు.

తాజాగా.. ప్ర‌కృతికి ఆగ్ర‌హం వస్తే ఎలా ఉంటుందో ఉద‌హ‌రించారు. అరేబియా స‌ముద్రంలో కేంద్రీకృత‌మైన తౌక్తే తుఫాను నిన్న తీరం దాటింది. గ‌త మూడ్నాలుగు రోజులు ఐదు రాష్ట్రాల్లో బీభ‌త్సం సృష్టిస్తున్న ఈ తుఫాను.. నిన్న భారీ వ‌ర్షాల‌తో జ‌న‌జీవ‌నాన్ని అత‌లా కుత‌లం చేసింది. ఈ తుఫాను ధాటికి ప‌లువురు ప్రాణాలు కోల్పోగా.. ఆస్తి న‌ష్టం అపారంగా సంభ‌వించింది.

అయితే.. తుఫాను తీరం దాటుతున్న‌ప్పుడు.. ముంబైలో స‌ముద్ర‌పు అల‌లు తీరానికి అత్యంత బ‌లంగా పోటెత్తాయి. దీంతో.. రోడ్లు మొత్తం స‌ముద్ర‌పు నీటితో జ‌ల‌మ‌యం అయిపోయాయి. ప్ర‌తిష్టాత్మ‌క ముంబై తాజ్ హోట‌ల్ ముందు బీభ‌త్సం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన ఆర్జీవీ.. ఇది న‌మ్మ‌శ‌క్యం కాకుండా ఉంద‌న్నారు. ప్ర‌కృతిని త‌క్కువ అంచ‌నా వేయ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతోంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.