Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారును టార్గెట్ చేస్తూ ఆర్జీవీ మరో సంచలన ట్వీట్..!

By:  Tupaki Desk   |   8 Jan 2022 9:43 AM GMT
ఏపీ సర్కారును టార్గెట్ చేస్తూ ఆర్జీవీ మరో సంచలన ట్వీట్..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల నియంత్రణ వ్యవహారం మీద రచ్చ కొనసాగుతూనే ఉంది. దీనిపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ గురించి ఏనాడూ ఆలోచించని ఆర్జీవీ సైతం.. ఏపీ సర్కారు నిర్ణయాన్ని తప్పు బడుతూ వస్తున్నారు. చిత్ర పరిశ్రమ తరపున మాట్లాడుతూ.. మీడియా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ ధరల అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానితో సమావేశమై చర్చించబోతున్నారు.

ఏపీ ప్రభుతం మీద ప్రశ్నల వర్షం కురిపించిన రామ్ గోపాల్ వర్మ.. టికెట్ ధరల వ్యవహారం మీద జనవరి 10న మంత్రి పేర్ని నానితో భేటీ కానున్నారు. అమరావతి సచివాలయానికి మంత్రి నుంచి పిలుపు వచ్చిందని ఆర్జీవీ స్వయంగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలపై సహృద్భావ పరిష్కారం కోసం దయ చూపినందుకు ధన్యవాదాలని ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే మరో రెండు రోజుల్లో ఈ సమావేశం జరుగుతుందనగా.. తాజాగా వర్మ మరో సంచలన ట్వీట్ చేశారు.

ఆర్జీవీ ఈరోజు ట్వీట్ చేస్తూ.. ''సినిమాలు - థీమ్ పార్కులు - మ్యూజిక్ కన్సర్ట్స్ - మ్యాజిక్ షోలు మొదలైనవి కూడా ఎంటర్టైన్మెంట్ సంస్థల క్రిందకు వస్తాయి. వాటి టిక్కెట్ ధరలను కూడా ప్రభుత్వం నిర్ణయించలేదు'' అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత కూడా వర్మ ఇలా ట్వీట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై పలువురు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

'టికెట్ రేట్లు పెంచేవాడికి ప్రేక్షకుడిని ఇబ్బంది లేనప్పుడు ప్రభుత్వానికి సమస్య ఏంటి?' అనే ఆర్జీవీ ప్రశ్నకు కౌంటర్లు వేస్తున్నారు. 'లంచం ఇచ్చేవాడికి తీసుకునేవాడికి ఇబ్బంది లేనప్పుడు ఏసీబీకి ఎందుకని..నీలి చిత్రాలు తీసేవాడికి చూసే వాడికి ఇబ్బంది లేనప్పుడు సెన్సార్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటి?' అని కామెంట్స్ పెడుతున్నారు. దీనికి స్పందించిన వివాదాస్పద దర్శకుడు.. ''ఒరేయ్ సుబ్బారావుల్లారా నేను అడిగిన క్వశ్చన్ లీగల్ జ్యూరిస్ట్రిక్షన్ లో ఉంది. మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి'' అని ట్వీట్ చేశారు.

ఏదేమైనా మరో రెండ్రోజుల్లో సినిమా టికెట్ రేట్ల అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని కలవనున్న రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు సినిమా అనే ఎంటర్టైన్మెంట్ కు ప్రభుత్వం ధరలను నిర్ణయించలేదు అంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి మంత్రితో జరిగే భేటీతో ఆర్జీవీ ఇండస్ట్రీలోని సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తారో లేదో చూడాలి.