Begin typing your search above and press return to search.

RGV కి నట్టి షాక్.. డేంజరస్ ప్రచారమంతా బూడిదలో పోసిన పన్నీరేనా..?

By:  Tupaki Desk   |   5 May 2022 12:04 PM GMT
RGV కి నట్టి షాక్.. డేంజరస్ ప్రచారమంతా బూడిదలో పోసిన పన్నీరేనా..?
X
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తన సినిమా రిలీజ్ చేసే ఆర్జీవీ.. అప్పుడెప్పుడో పూర్తైన లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ ''డేంజరస్'' చిత్రాన్ని విడుదల చేసుకోలేకపోతున్నారు. తెలుగులో 'మా ఇష్టం' పేరుతో రానున్న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసిన ప్రతీసారి వర్మకు షాక్ మీద షాక్ తగులుతోంది.

నైనా గంగూలీ - అప్సర రాణి ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'మా ఇష్టం' చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 8న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని భావించారు. దీనికి తగ్గట్టుగానే ఎప్పుడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అయితే సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని.. ఈ థీమ్‌ ను తమ హాళ్లలో ప్రదర్శించలేమని పలు థియేటర్ల యాజమాన్యాలు వర్మకు కౌంటర్ ఇచ్చాయి. దీనిపై కోర్టులో తేల్చుకుంటానని వర్మ సవాలు విసిరారు.

అయితే మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లలోకి వస్తుందనగా.. సరిగ్గా ఆర్జీవీ పుట్టినరోజు నాడు 'మా ఇష్టం' రిలీజ్ కు బ్రేక్ పడింది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి 'డేంజరస్' చిత్రం విడుదల పై స్టే తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చేవరకు 'మా ఇష్టం' సినిమా రిలీజ్ ను ఆపివేయాలని కోర్టును కోరడంతో.. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది.

ఈ క్రమంలో ఆర్జీవీ - నట్టి కుమార్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ విమర్శలు ప్రతి విమర్శలతో పోటాపోటీగా ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసుకున్నారు. అయితే కోర్టు ఇచ్చిన ఇంజక్షన్​ ఆర్డర్ ను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిందని.. క్లియరెన్స్ ఆర్డర్ వచ్చింది కనుక 'మా ఇష్టం' సినిమాను మే 6న రిలీజ్ చేయబోతున్నామని వర్మ ప్రకటించారు. మళ్ళీ లెస్బియన్స్ థ్రిల్లర్ కు ప్రమోషన్స్ చేశారు.

రేపు 'మా ఇష్టం' సినిమా విడుదల అవుతుందని అనుకుంటుండగా.. రాంగోపాల్ వర్మకు నట్టి కుమార్ మరోసారి షాక్ ఇచ్చారు. సినిమాను ఆపేయాలంటే కోర్టుకు వెళ్లి మే 6న రిలీజ్ అయ్యే చిత్రంపై మరో స్టే తీసుకొచ్చాడు. నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి కి బాకీ డబ్బు మొత్తం చెల్లించిన తరువాతనే సినిమాను రిలీజ్ చేయాలనీ.. అప్పటివరకు థియేటర్లలో లేదా ఓటిటీలో రిలీజ్ చేయడానికి వీల్లేదని కోర్టు తీర్పునిచ్చింది.

దీనిపై ఆర్జీవీ ఇంకా స్పందించలేదు. రేపు శుక్రవారం 'డేంజరస్' మూవీ రిలీజ్ ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై వర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఏదేమైనా 'మా ఇష్టం' సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోందనే చెప్పాలి. సినిమా కోసం చేసిన ప్రచారమంతా రెండుసార్లు బూడిదలో పోసిన పన్నీరు అయింది. మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.