Begin typing your search above and press return to search.

'నేను వాళ్ళ బెడ్ రూమ్ లోకి వెళ్లి.. కిచెన్ లో ఏమి మాట్లాడుకున్నారనేది కాదు సినిమా'

By:  Tupaki Desk   |   7 Nov 2020 3:33 PM GMT
నేను వాళ్ళ బెడ్ రూమ్ లోకి వెళ్లి.. కిచెన్ లో ఏమి మాట్లాడుకున్నారనేది కాదు సినిమా
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ 'మర్డర్‌' అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్న కుటుంబ కథా చిత్రమ్‌ అని వర్మ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం ప్రచార చిత్రాలు ట్రైలర్ ద్వారా ఇది మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసు ఆధారంగా వర్మ తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం అయింది. ఈ సినిమాపై ప్రణయ్ భార్య అమృత అభ్యంతరం వ్యక్తం చేస్తూ విడుదలను నిలిపివేయాలని నల్గొండ కోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిని విచారించిన కోర్టు 'మర్డర్' సినిమా విడుదలపై స్టే విధించింది. అయితే ఈ స్టేను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. మారుతీరావు, అమృత, ప్రణయ్‌ ఫొటోలు మరియు పేర్లు వాడకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చునని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ మీడియా ముందుకు వచ్చి హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అలానే 'మర్డర్' సినిమా అమృత - ప్రణయ్‌ ల స్టోరీ కాదని.. అలాంటి అనేక ఘటనల ఆధారంగా సినిమా తీశానని.. ఎవరినీ కించపరచలేదని.. తాను తీసిన సినిమా అమృత కుటుంబం గురించి కాదని.. అలాంటప్పుడు వాళ్ల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వర్మ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రామ్‌ గోపాల్‌ వర్మ స్పందిస్తూ.. ''ప్రణయ్ - అమృత స్టోరీతో సినిమా తీస్తున్నా అని నేను ఎక్కడా చెప్పలేదు. నిజ జీవితంలో జరిగిన అనేక స్టోరీల ఆధారంగా తీసాను. నాకు ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం లేదు. ఎవరిని తక్కువగా చూపించలేదు. కేవలం ఓ ఎమోషన్ ని నా కెపాసిటీ మేరకు సినిమాగా తీయాలనే ఉద్దేశ్యం తప్పితే ఇంకేమీ లేదు. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్‌ లో వచ్చి మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగిన కథల ఆధారంగా నేను సినిమా చేస్తే కొత్తగా జరగడానికి ఏముంటుంది. ఒకరు కరెక్ట్ మరొకరు రాంగ్ అని చెప్పడంలేదు. అలాంటి ఘటన ఎందుకు జరుగుతుంది అనే విశ్లేషణే నా సినిమా. నేను వాళ్ళ బెడ్ రూమ్ లోకి వెళ్లి కిచెన్ లో ఏమి మాట్లాడుకున్నారు అనేది కాదు ఈ సినిమా. వాళ్ళతోటి నా కథకి సంబంధం లేదు. ప్రేమ వివాహాలు జరిగినప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయి. సంవత్సరానికి రెండు మూడు ఇలాంటివి వింటూనే ఉంటాం. వాటిలో కొన్ని పాపులర్ అవుతాయి కొన్ని కావు'' అని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు నట్టికుమార్ - నట్టి కరుణ - ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.