Begin typing your search above and press return to search.

జీఎస్టీ ఎఫెక్ట్‌!... పోలీస్ స్టేష‌న్‌ లో ఆర్జీవీ!

By:  Tupaki Desk   |   17 Feb 2018 7:19 AM GMT
జీఎస్టీ ఎఫెక్ట్‌!... పోలీస్ స్టేష‌న్‌ లో ఆర్జీవీ!
X
బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల తెర‌కెక్కించిన వెబ్ సిరీస్‌ *గాడ్ - సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ)* పెద్ద వివాదాన్నే రేపిన సంగ‌తి తెలిసిందే. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా... వ‌ర్మ మాత్రం త‌న‌దైన రూట్లోనే ప‌య‌నించి స‌ద‌రు చిత్రాన్ని విడుద‌ల చేసేశారు. అయితే అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ స‌ద‌రు చిత్రం వ‌ర్మ‌కు కాసుల వ‌ర్షాన్నే కురిపించింది. ఇష్ట‌మున్న వారు మాత్ర‌మే త‌న చిత్రాన్ని చూస్తార‌ని - ఇష్టం లేని వారు అస‌లు త‌న సినిమా పోస్ట‌ర్ల‌ను కూడా చూడాల్సిన అవ‌స‌రం లేదంటూ త‌న‌దైన వాద‌న‌లు వినిపించిన వ‌ర్మ‌... వెబ్ ఆధారిత చిత్రం కావ‌డంతో ఇత‌రులు కూడా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలియ‌జేయ‌డానికి వీలు లేకుండా పోయిన విష‌యం కూడా మ‌న‌కు తెలిసిందే. అంతేకాకుండా వెబ్ సిరీస్‌ గా వ‌స్తున్న త‌న చిత్రంతో స‌మాజానికి జ‌రిగే న‌ష్ట‌మేమీ లేదంటూ కూడా వ‌ర్మ త‌న‌దైన శైలి వాద‌న‌లు వినిపించడంతో పాటుగా ప‌లు తెలుగు న్యూస్ ఛానెళ్లు నిర్వ‌హించిన లైవ్ డీబేట్ల‌కు హాజ‌రై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ సామాజిక ఉద్య‌మ‌కారిణి దేవిపై ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు కూడా చేశారు. దీంతో భ‌గ్గుమ‌న్న దేవి... నేరుగా పోలీసుల‌ను ఆశ్ర‌యించి వ‌ర్మ‌పై కేసు పెట్టేశారు. దేవి ఫిర్యాదు ఆధారంగా వ‌ర్మ‌పై రెండు కేసులు న‌మోద‌య్యాయి. వాటిలో ఒకటి సెక్స్ ప్ర‌ధానాంశంగా చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం అయితే... రెండోది మ‌హిళ‌ల‌పై ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం.

ఈ రెండు కేసుల‌ను బుక్ చేసిన హైద‌రాబాదు సీసీఎస్ పోలీసులు విచార‌ణ‌కు రావాల్సిందిగా ఇదివ‌ర‌కే వ‌ర్మ‌కు నోటీసులు జారీ చేశారు. అయితే తాను ముంబైలో ఉన్నాన‌ని - సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఇప్ప‌టికిప్పుడు విచార‌ణ‌కు హాజరు కాలేన‌ని - వీలు చూసుకుని వ‌స్తాన‌ని త‌న న్యాయ‌వాది ద్వారా పోలీసుల‌కు స‌మాచారం చేర‌వేశారు. దీనిపై సానుకూలంగానే స్పందించిన పోలీసులు... వ‌ర్మ‌కు కాస్తంత టైమిచ్చారు. నిర్దేశిత స‌మ‌యం ముగిసింద‌ని భావించిన పోలీసులు... మ‌రోమారు వ‌ర్మ‌కు నోటీసులు పంపారు. ఈ ద‌ఫా విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోతే అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తామ‌ని హెచ్చ‌రించ‌డంతో వ‌ర్మ దిగిరాక త‌ప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో కాసేప‌టి క్రితం త‌న న్యాయవాదిని వెంటేసుకుని వ‌చ్చిన వ‌ర్మ‌... సీసీఎస్ పోలీస్ స్టేష‌న్ లోప‌లికి వెళ్లారు. వ‌ర్మ‌ - ఆయ‌న న్యాయవాదిని మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించిన పోలీసులు... ఇత‌రుల‌ను అనుమ‌తించ‌లేదు. విచార‌ణ‌కు వెళ్లిన వ‌ర్మ అరెస్ట్ అవుతారా? - లేదంటే ఎలా వెళ్లారో - అలాగే బ‌య‌ట‌కు వ‌స్తారా? అన్న అంశం ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

వ‌ర్మ‌పై న‌మోదైన రెండు కేసుల‌కు సంబందించి స‌మ‌గ్రంగానే విచార‌ణ జ‌రుపుతామ‌ని - ఈ విష‌యంలో వ‌ర్మ‌ను సాధార‌ణ పౌరుడిలాగే ప‌రిగ‌ణిస్తామ‌ని సీసీఎస్ డీసీపీ ర‌ఘువీర్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘువీర్ చేసిన కామెంట్లు కాస్తంత ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వ‌ర్మ‌ను అరెస్ట్ చేస్తారా? అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన ర‌ఘువీర్‌... *అరెస్ట్ చేయాలా? - వ‌ద్దా? అనేది ఇంకా నిర్ణ‌యించుకోలేదు. అయినా ఇప్పుడు వ‌ర్మను విచార‌ణ కోస‌మే పిలిపించాం. రెండు కేసుల‌పై స‌మ‌గ్రంగానే వివ‌రాలు సేక‌రిస్తాం. అయినా అరెస్ట్ అనేది...మేం అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ‌ర్మ ఇచ్చే స‌మాధానాల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. అస‌లు జీఎస్టీ చిత్రాన్ని ఎందుకు తెర‌కెక్కించాన‌న్న విష‌యంపై వ‌ర్మ క్లియ‌ర్‌ గానే స‌మాధానం చెప్పాల్సి ఉంది* అని ఆయ‌న వ్యాఖ్యానించారు. మొత్తంగా వ‌ర్మ‌పై పోలీసులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌డం ఖాయ‌మ‌నే తెలుస్తోంది. ఈ ప్ర‌శ్న‌ల‌కు వ‌ర్మ ఎలా స‌మాధానాలు చెబుతార‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి వ‌ర్మఅరెస్ట్ అవుతారా - లేదంటే ఎలా వెళ్లారో అలానే బ‌య‌ట‌కు న‌డిచి వ‌స్తారా? అన్న‌ది నేటి సాయంత్రానికి గానీ తేలేలా లేదు. చూద్దాం. ఏం జ‌రుగుతుందో.