Begin typing your search above and press return to search.

'పవర్ స్టార్' వెనక ఉన్న ఆ అదృశ్య వ్యక్తి ఎవరు...?

By:  Tupaki Desk   |   22 July 2020 8:30 PM IST
పవర్ స్టార్ వెనక ఉన్న ఆ అదృశ్య వ్యక్తి ఎవరు...?
X
వివాదాస్పద చిత్రాలు తెరకెక్కించే రామ్ గోపాల్ వర్మ లేటెస్టుగా ''పవర్ స్టార్'' అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని సెటైరికల్ గా తీస్తున్న సినిమా అని అందరికీ తెలుసు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్ ని పోలిన ప్రవన్ కళ్యాణ్ ని పరిచయం చేసాడు. కానీ వర్మ మాత్రం ఇది నిజ జీవితంలోనే ఏ వ్యక్తిని ఉద్దేశించి తీసింది కాదని చెప్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పవర్ స్టార్' ట్రైలర్‌ వచ్చేసింది. వర్మ విడుదల చేయడానికి ముందే ఓ యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్షమైంది. ఇక చేసేదేమీ లేక వర్మ యూట్యూబ్ లో ముందే ఈ ట్రైలర్ అధికారికంగా విడుదల చేసారు. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌ లో వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి చాలా అంశాలు చూపించాడని అర్థం అవుతోంది.

'పవర్ స్టార్' ట్రైలర్ ''ఈ చిత్రం ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అంకితం'' అనే లైన్ తో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు వర్మ చెప్తున్నట్లే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు రాత్రి అంటూ ఓ దృశ్యం చూపించారు. టీవీలో ఎన్నికల ఫలితాలు ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ప్రవణ్ కల్యాణ్ టీవీ పగలకొడతాడు. ఒక్క సీటు కూడా రాలేదా అని ప్రవణ్ ఆవేదనగా అడుగగా.. 'ఒకటి వచ్చింది సార్ కానీ మీకు ఒక్కటి కూడా రాలేదు' అని అనుచరుడు చెప్తాడు. 'ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పరా.. నువ్వు పవర్ స్టార్ అయ్యింది.. కానిస్టేబుల్ కొడుకుగానా.. నా తమ్ముడిగానా? అంటూ మెగాస్టార్ గెటప్‌ లో ఉన్న వ్యక్తి ప్రశ్నిస్తాడు. ఈ ట్రైలర్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ గెటప్‌ లో ఉన్న వ్యక్తిని హీరో కొట్టడం.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలిన వ్యక్తితో మాట్లాడటం.. తన ఫ్యాన్స్‌ ను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం.. ప్రవణ్ కల్యాణ్ తో కత్తి మహేశ్ ఇంటర్వ్యూ.. బండ్ల గణేశ్ ను పోలిన వ్యక్తి తో ప్రవణ్ కల్యాణ్ సంభాషణ.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి.

కాగా ఈ ట్రైలర్ చివర్లో 'నేను రాజకీయాల్లో ఉండాలా అక్కర్లేదా?' అని ప్రవన్ కళ్యాణ్ బిగ్గరగా అరిచినప్పుడు ఓ అదృశ్య వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. ఆయనెవరన్నది ఈ ట్రైలర్ లో రివీల్ చేయలేదు. దీంతో ''పవర్ స్టార్'' సినిమాలో ఆ అదృశ్య వ్యక్తి ఎవరనేది ఆసక్తిగా మారింది. అయితే చేతిలో వోడ్కా బాటిల్ పట్టుకొని స్లో మోషన్ వచ్చి ప్రవన్ కళ్యాణ్ వెనుక కూర్చుంటాడు. వోడ్కా బాటిల్ పట్టుకొని ఉండటంతో ఆ వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని సినీ అభిమానులు ఫిక్స్ అయ్యారు. నిజానికి ''పవర్ స్టార్'' సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమాలో PS MS NB TS లతో పాటు RGV కూడా నటించబోతున్నాడని వర్మ ప్రకటించారు. దీనిని బట్టి చూసుకుంటే అది ఆర్జీవీ యే అని తెలుస్తోంది. ఆర్జీవీ పాత్రలో ఆయనే నటించాడా లేదా మిగతా పాత్రల వలె ఆర్జీవీని పోలిన వ్యక్తిని పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. ఆ క్యారెక్టర్ కనుక వర్మ ప్లే చేసి ఉంటే ఫస్ట్ టైం ఓ సినిమాలో యాక్ట్ చేసినట్లు అవుతుంది. ఇప్పటికే సింగర్ గా లిరిక్ రైటర్ గా మెప్పించే ప్రయత్నం చేసిన డైరెక్టర్ వర్మ 'పవర్ స్టార్' సినిమాతో యాక్టర్ గా కూడా నిరూపించుకోవాలని చూస్తున్నాడేమో అని సినీ అభిమానులు అంటున్నారు. మరి ఆ అదృశ్య వ్యక్తి ఎవరో తెలియాలంటే జూలై 25 వరకు ఆగాల్సిందే.