Begin typing your search above and press return to search.

స్పెషల్ స్టోరీ: పరిశ్రమపై రివ్యూల ప్రభావం

By:  Tupaki Desk   |   28 May 2018 5:50 AM GMT
స్పెషల్ స్టోరీ: పరిశ్రమపై రివ్యూల ప్రభావం
X
సినిమా అనేది కళాత్మక వ్యాపారం. అది కాదనలేని సత్యం. కాకపోతే సృజనాత్మకతతో ముడిపడి ఉంటుంది కాబట్టి మిగిలిన వాటితో పోలిస్తే ఇక్కడ రిస్క్ ఎక్కువ. లాభం కంటే నష్టం వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి . అందుకే ఏ బాషా సినిమా పరిశ్రమ తీసుకున్నా సక్సెస్ రేషియో 20 శాతం మించి ఉండదు. అయినా సినిమాల నిర్మాణం ఆగదు. ప్రేక్షకుడికి సినిమా మీద ఉన్న వ్యామోహం తగ్గదు. ఇది జీవిత సత్యం. కాకపోతే టెక్నాలజీ విస్తృతంగా వాడుకలోకి వచ్చాక ఆన్ లైన్ మీడియాతో పాటు వీడియో స్ట్రీమింగ్ సైట్స్ కి విపరీతమైన ఆదరణ దక్కుతోంది. సినిమా గురించే కాదు ఏ విషయమైనా సరే ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా దానికి సంబంధించిన సమాచారం క్షణాల్లో తెలిసిపోతోంది. సౌత్ లో అమితంగా ప్రేమించే సినిమాల గురించిన విశేషాలు తెలుసుకోవడానికి మనవాళ్ళు ఎంత తాపత్రయపడతారో ప్రత్యేకంగా చెప్పాలా. ఇది పసిగట్టే నేడు వందల సంఖ్యలో వెబ్ సైట్లు-యు ట్యూబ్ ఛానల్స్-నిర్మాణ సంస్థలు వెలిసి ఎంత త్వరగా ఎక్కువ శాతం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోగలమా అనే దాని మీద అధిక శాతం దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రివ్యూల ప్రభావం సినిమాల మీద ఉండటం వల్ల తాము నష్టపోతున్నాం అని కొందరు దర్శకనిర్మాతలు తమ హీరో సినిమాను నెగటివ్ పబ్లిసిటీ ఇచ్చి వసూళ్లు రాకుండా చేస్తున్నారని కొన్ని అభిమానుల వర్గాలు ఆరోపించడం ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగిపోయింది.

ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంది. రివ్యూ అనేది రాసిన రచయిత వ్యక్తిగత అభిప్రాయమే తప్ప అతను ప్రేక్షకులు ఎన్నుకున్న సినిమా ప్రతినిధి కాదు. కాకపోతే అధిక శాతం ప్రేక్షకుల మనోగతాన్ని తన రివ్యూ ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు కనక దాని మీద విశ్వసనీయత ఉండటం సహజం. దాని ప్రభావం వసూళ్ల మీద పూర్తిగా ఉంటుంది అని చెప్పుకోవడంలో లాజిక్ లేదు. ఎందుకంటే రివ్యూలో సినిమాలో ఏముంది ఏది బాగుంది ఏది ఆకట్టుకోలేకపోయింది అనేది చిన్న విశ్లేషణ రూపంలో ఉంటుంది తప్ప సినిమా ఎలా తీయాలి అనే గైడ్ గా ఉపయోగించుకోవడానికి కాదు. ఆమాటకొస్తే బాగాలేని సినిమాలకు రివ్యూలు ప్రతికూలంగా వచ్చినప్పుడు బాధ పడుతున్న వారు ఇక్కడ మరొక్క విషయం గుర్తించాలి. బాగున్నాయి అంటూ మెచ్చిన రివ్యూల రేటింగులు వాటి వెబ్ సైట్ పేర్లతో సహా పోస్టర్ పబ్లిసిటీ చేస్తున్న నిర్మాతలు ఎందరో ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్లంతా రివ్యూ రాసిన వాళ్ళను అవి పబ్లిష్ చేసిన వెబ్ సైట్ లను గౌరవించినట్టే కదా . తమ ప్రెస్ మీట్ లలో మా సినిమాకు ఆన్ లైన్ లో చాలా మంచి రేటింగ్ వచ్చాయి అని గర్వంగా చెప్పుకున్న నిర్మాతలు ఎందరో ఉన్నారు. ఇది రెండు వైపుల ఉన్న కాయిన్ లాంటిది. దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది. మొన్న వచ్చిన ఒక మాస్ సినిమా బాగాలేదు అని రాసిన వాళ్ళే మహానటిని ఆకాశానికెత్తారు. అందులో లోపాలు లేవు అని కాదు. ఉన్నాయి. కానీ వాటిని మరిపించేలా దర్శకుడు నాగ అశ్విన్ చేసిన మాయాజాలంలో అందరు పడిపోయారు కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే కదా దర్శకుడి ప్రతిభ అంటే. అసలు పాండవులనే చూపించకుండా కెవి రెడ్డి మహాభారత కథకు కల్పన జోడించి మాయాబజార్ తీస్తే అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ రిఫరెన్స్ గా చెప్పుకుంటూనే ఉన్నాం. తెలుగు సినిమాను మలుపు తిప్పిన ఆ సినిమా గురించి నెగటివ్ గా అన్నవాళ్ళు లేకపోలేదు. మెజారిటీ బాగుంది అన్నప్పుడు వాటికి విలువ లేదు. అంత వెనక్కు ఎందుకు అనుకుంటే అర్జున్ రెడ్డి కంటెంట్ విషయంలో ఎన్ని కామెంట్స్ వచ్చినా 40 కోట్ల పైచిలుకు వసూళ్లు దానికి వచ్చాయి అంటే కారణం ఒకటే. కంటెంట్. అది బాగుందనే కదా ప్రేక్షకులతో సహా రివ్యూయర్లు చెప్పింది.

రోజురోజుకి పెను మార్పులు చెందుతున్న మీడియా పరిశ్రమలో ఒక భాగంగా ఉంటుందే తప్ప దాన్ని శాశించే ప్రయత్నం కానీ ప్రభావితం చేసే సాహసం కానీ ఎన్నటికీ చేయలేదు. ముళ్ళపూడి వెంకటరమణ గారు తన కెరీర్ ప్రారంభంలో అప్పట్లో విడుదలైన పాత సినిమాలకు రివ్యూలు రాసేవాళ్ళు. చాలా సునిశితంగా కొన్ని సార్లు ఘాటుగా ఉండేవి. అడిగితే మీరు చెప్పింది చూపించింది నేను రెండు ముక్కల్లో నాకు తోచింది రాసాను అని తప్పుకునేవారు. సాంకేతిక విప్లవం వల్ల మునివేళ్ళపై స్మార్ట్ ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్న ప్రేక్షకుడు సినిమా రివ్యూ చదివి ఒక అవగాహన తెచ్చుకుంటాడు తప్ప దాన్ని బట్టి సినిమా చూడాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా తీసుకోడు. అందరు అదే ఫాలో అయ్యే పనైతే ఏ సినిమాకు మొదటి ఆటకు ప్రేక్షకుడు ఉండడు. డిజాస్టర్ ఆయన స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజు అన్ని ఆటలు హౌస్ ఫుల్స్ ఉంటాయి. బాగుంది అంటే రికార్డుల ఊచకోతకు బ్రేకులు ఉండవు. రంగస్థలం చూసాంగా. తేడా వస్తే ఏం జరుగుతుందో అజ్ఞాతవాసి నేర్పిన పాఠం త్రివిక్రమ్ స్వయంగా ఒప్పుకున్నాడు. సో సినిమాకు ఈ రివ్యూల అభిప్రాయం ఒక ఊతంగా పనికొస్తుంది కానీ దాన్ని పూర్తిగా ప్రభావితం చేసేందుకు కాదు. ఈ సత్యం గుర్తించినంత కాలం ఎటువంటి సమస్యలు ఉండవు