Begin typing your search above and press return to search.

భరణం తీసుకోలేదన్న రేణు దేశాయ్

By:  Tupaki Desk   |   7 July 2018 3:36 PM IST
భరణం తీసుకోలేదన్న రేణు దేశాయ్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక అతడి నుంచి రేణు దేశాయ్ భారీగా భరణం తీసుకుందని ఒక ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. ఐతే తాను భరణం రూపంలో పవన్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రేణు స్పష్టం చేసింది. తాజాగా ‘బీబీసీ తెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఐతే విడాకుల తర్వాత తన పిల్లలకు న్యాయంగా రావాల్సింది మాత్రం వచ్చిందని ఆమె వెల్లడించింది. కానీ పవన్ నుంచి విడిపోయాక తాను మానసికంగా.. శారీరకంగా.. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని రేణు చెప్పింది. తన తండ్రి ఉద్యోగ రీత్యా లండన్ వెళ్లిపోయారని.. పుణెలో ఇక తనకు దగ్గరి బంధువులెవరూ లేరని.. ఒంటరిగానే తాను పిల్లల్ని పెంచి పెద్ద చేశానని ఆమె తెలిపింది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని ఆమె అంది.

తన ఆరోగ్యం బాగా దెబ్బ తిందని.. చాలాసార్లు ఆసుపత్రిలో చేరానని.. ఒకసారి శ్వాసకోస సమస్య.. ఇంకోసారి గుండె సమస్యతో బాధపడ్డానని.. తాను ఈ బాధతో ఆసుపత్రి చుట్టూ తిరిగినపుడు తన పిల్లలు చాలా వేదన అనుభవించారని ఆమె చెప్పింది. మధ్యలో వాళ్ల ఆరోగ్యం కూడా పాడైందని వెల్లడించింది రేణు. ఐతే తనకు ఇల్లు ఉందని.. అలాగే డబ్బులుండటం వల్ల ఆసుపత్రి బిల్లులు కట్టడానికి ఇబ్బంది లేకపోయిందని.. కానీ ఇల్లు లేక.. ఆసుపత్రి బిల్లులు కూడా కట్టలేక కష్టపడేవాళ్లు చాలామంది ఉన్నారని.. అలాంటి వాళ్లను తలుచుకుని బాధ తగ్గించుకున్నానని రేణు చెప్పింది. ఇక ఇటీవలే ఓ సందర్భంలో పవన్ తో విడాకులకు దారితీసిన కారణాలేంటో చెబితే అభిమానుల నోళ్లు మూతపడతాయి అంటూ తాను చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తే.. ‘‘ఇప్పుడు దాని గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు. తెలివైన వాళ్లు తప్పు ఎవరిదో అర్థం చేసుకుంటారు. తెలివిలేని వాళ్లు అర్థం చేసుకోలేరు. ఆ ట్వీట్ చూసి అర్థం చేసుకోండి. అంతకుమించి నేనేమీ చెప్పదలుచుకోలేదు’’ అంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేసింది రేణు.