Begin typing your search above and press return to search.

ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

By:  Tupaki Desk   |   27 Feb 2019 12:10 PM GMT
ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్
X
మాజీ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యరేణు దేశాయ్ రీసెంట్ గా తన కర్నూలు పర్యటనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. రేణు త్వరలో తెరకెక్కించనున్న సినిమాకోసమే ఈ పర్యటన అని మొదట వార్తలు వచ్చాయి. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో రేణు సినిమా ఉంటుందని అన్నారు. కానీ అది ఒక టీవీ ఛానల్ కోసం రేణు చేస్తున్న షో అని.. రైతు సమస్యల నేపథ్యంలో ఈ షో ఉంటుందని తర్వాత క్లారిటీ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ షో వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రేణు దేశాయ్ ఆ ఆరోపణలపై స్పందిస్తూ "నేను మనస్ఫూర్తిగా ఈ షోను రైతులకోసమే చేస్తున్నాను. ఇందులో ఎటువంటి రాజకీయ కోణాలు లేవు. నేను వందలమంది రైతులను కలవడం జరిగింది. వారి సమస్యలు తెలుసుకొని చలించిపోయాను. నేను కనీసం ఒక్క రైతుకు అయినా సహాయపడినా.. నా వల్ల ఒక్క రైతు జీవితంలో మార్పు వచ్చినా నాకంతకంటే సంతోషం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చింది.

రేణుకు పొలిటికల్ గోల్స్ ఉన్నాయో లేదో తెలీదు కానీ చాలామంది నెటిజనులు తన వివరణపై పూర్తిగా సంతృప్తి చెందడం లేదు. రేణు దేశాయ్ ఆ షో చేయడం వెనక ఉద్దేశం మంచిది అయి ఉండొచ్చుగానీ త్వరలో ఎలెక్షన్స్ రానుండడంతో ఇది రాజకీయాల కారణాలతో రూపొందించిన షో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలా అని రేణుకు మద్దతిచ్చే వాళ్ళు లేకపోలేదు.. రైతు సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు టీవీ షో చేయడం అనేది ఒక మంచి ఆలోచన అని.. నిజానికి రైతుల సమస్యలకు సంబంధించి ఇలాంటి షోలు మరి కొందరు కూడా చేయాలని అంటున్నారు.