Begin typing your search above and press return to search.

ఫోకస్‌: మాతృకలో జీవం మిస్సివ్వడం వల్లే

By:  Tupaki Desk   |   27 Jun 2015 7:30 PM GMT
ఫోకస్‌: మాతృకలో జీవం మిస్సివ్వడం వల్లే
X
పొరుగు భాషల నుంచి తెలుగులోకి రీమేక్‌ చేసిన సినిమాల్లో మెజారిటీ భాగం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడానికి కారణం ఏమిటి? అక్కడ విజయం సాధించినా ఇక్కడ చతికిలబడడానికి రీజనింగ్‌ ఏమిటి? ఆరాతీస్తే చాలా సంగతులే తెలిసొచ్చాయి. కొన్ని ఉదాహరణలతో వాటన్నిటినీ విశ్లేషిస్తే..

అప్పట్లో హీరో రాజశేఖర్‌ తమిళ్‌లో సూపర్‌ హిట్‌ అయిన 'సేతు' (బాల దర్శకుడు) చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేశారు. జీవిత రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. పేరైతే వచ్చింది కానీ కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు. దీనికి కారణాలు బోలెడు. ఇది వాస్తవానికి తమిళ నేటివిటీ ఉన్న కథాంశం. అప్పటికి రా మెటీరియలిస్టిక్‌ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమాలు మనవాళ్లకు కొత్త. పైగా తెలుగులో విజువల్‌ గ్రాండియారిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. డీగ్లామరైజ్డ్‌ క్యారెక్టర్‌లో హీరోని ఊహించుకునేంతటి పెద్ద మనసు మన ప్రేక్షకులకు లేదు. తత్ఫలితం బాక్సాఫీస్‌ వద్ద కనిపించింది. అయితే దర్శకురాలిగా జీవితకు నూటికి నూరు శాతం మార్కులేశారు.

ఇటీవలి కాలంలో రాజశేఖర్‌ హీరోగా తమిళ హిట్‌ చిత్రం 'సూదుకవ్వుం'ని తెలుగులో గెడ్డం గ్యాంగ్‌ పేరుతో రీమేక్‌ చేశారు. అయితే ఈ సినిమా కూడా మరోసారి నెగెటివ్‌ ఫలితాన్నే ఇచ్చింది రాజశేఖర్‌కి. అయితే ఈసారి సీన్‌ వేరే. ఏకంగా కథనే మార్చేయడం వల్ల బాక్సాఫీస్‌ కుదేలైపోయింది. తమిళంలో ఈ చిత్రంలో నటించిన ఫేసులేవీ గుర్తు పట్టేవి కావు. అంతా కొత్తవాళ్లతో చేశారు. పైగా అక్కడ ప్రతి పాత్రా హీరోనే అనిపించేలా తీర్చిదిద్దారు. ఒక్కో సందర్భంలో ఒక్కో పాత్రలో హీరోయిజం కనిపించి మెస్మరైజ్‌ చేస్తుంది. అయితే అదే యుఎస్‌పి తెలుగులో లేకుండా చేశారు. ఏ కోణంలో చూసినా గెడ్డంగ్యాంగ్‌ని నడిపించే నాయకుడొక్కడే (రాజశేఖర్‌) హీరోగా కనిపిస్తాడు. అందువల్ల టోటల్‌ టింజ్‌ మిస్సయ్యింది.

అప్పట్లో తిరుపతి కుర్రాడు శ్రీకాంత్‌ (ఇక్కడ శ్రీరామ్‌) హీరోగా రోజా కూటం చిత్రాన్ని తెలుగులో రోజా పూలుగా విడుదల చేశారు. తమిళ్‌లో మంచి టాక్‌ వచ్చినా తెలుగులో విజయం సాధించలేదు ఈ చిత్రం. ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకునే తెరకెక్కించారు. అయినా ఫలితం అనుకున్న విధంగా రాలేదు. అలాగే రవితేజ ప్రధాన పాత్రలో నాడోడిగల్‌ చిత్రాన్ని శంభో శివ శంబో పేరుతో రీమేక్‌ చేశారు. ఇది తెలుగులో ఫర్వాలేదనిపించే విజయాన్ని అందుకుంది. మాతృకలో ఫీల్‌ మెజారిటీ భాగం క్యారీ అయ్యింది కాబట్టే పాజిటివ్‌ ఫలితం వచ్చింది. ఇటీవలి కాలంలో మలయాళ హిట్‌ చిత్రం బాడీ గార్డ్‌ ని వెంకీ హీరోగా రీమేక్‌ చేశారు. అయితే మాతృకలో ఉన్న ఫీల్‌ రీమేకులో లేకపోవడంతో నిర్ధయగా తిరస్కరించారు మన ప్రేక్షకులు.

ప్రస్తుతం విష్ణు హీరోగా దేవకట్టా దర్శకత్వంలో డైనమైట్‌ అనే రీమేక్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ చిత్రం అరిమానంబికి రీమేక్‌ ఇది. ఒక సామాన్యుడు మినిష్టర్‌తో పెట్టుకుంటే ఏమవుతుంది? అన్నదే కాన్సెప్టు. కానీ తెలుగులో హీరోకి సూపర్‌మేన్‌ లక్షణాల్ని ఆపాదించారు. అంటే టోటల్‌గా సోల్‌ మిస్సవ్వడానికే ఆస్కారం కనిపిస్తోంది. సామాన్యుడు తిరగబడడానికి, సూపర్‌మేన్‌ తిరగబడడానికి తేడా లేదూ? అదన్నమాట!

ఇలా రీమేకులు తిరగబడడానికి మాతృకలో ఉన్న ఫీల్‌ మిస్సవ్వడానికి కారణాలేంటో సుస్పష్టం. మనవాళ్లు కథలో వేలు పెట్టి కెలకడం వల్ల ఒరిజినాలిటీ పోవడం వల్ల ఇలా అట్టర్‌ ఫ్లాప్‌లు ఎదుర్కోవాల్సొచ్చింది.