Begin typing your search above and press return to search.

రీ‘మేకులు’ ఇలా దిగుతున్నాయేంటబ్బా?

By:  Tupaki Desk   |   6 April 2016 5:30 PM GMT
రీ‘మేకులు’ ఇలా దిగుతున్నాయేంటబ్బా?
X
రీమేక్‌.. చాలా సులభమైన సక్సెస్‌ ఫార్ములా. కథాకథనాల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఆల్రెడీ ప్రూవ్‌ అయిన సక్సెస్‌ ఫార్ములా కాబట్టి హిట్టు కొడతామా లేదా అని సందేహించాల్సిన పని లేదు. హక్కులు కొనుక్కోవడం.. తెలుగులోకి తర్జుమా చేసేయడం.. హిట్టు కొట్టేయడం.. ఇలా ఉండేది ఒకప్పుడు పరిస్థితి. గతంలో ఎన్నో రీమేక్‌ సినిమాలు ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసే స్థాయిలో హిట్టయ్యాయి. కానీ ఇప్పుడు రీమేక్‌ అంటే జడుసుకునే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు మూడేళ్లలో తెలుగులో వచ్చిన రీమేకుల్లో మెజారిటీ చేదు ఫలితాన్నే అందుకున్నాయి. రీమేక్‌ అంటే ఒకప్పుడు సేఫ్‌ గేమ్‌ అన్నట్లుండేది. కానీ ఇప్పుడదే చాలా పెద్ద రిస్క్‌ అవుతోంది.

వేరే భాషల్లో చాలా పెద్ద హిట్లయిన సినిమాలు తెలుగులోకి వచ్చేసరికి డిజాస్టర్లవడం గమనార్హం. బోల్‌ బచ్చన్‌ హిందీలో సూపర్‌ హిట్‌. కానీ దాని తెలుగు వెర్షన్‌ 'మసాలా' అట్టర్‌ ఫ్లాప్‌. 'సూదుకవ్వుం' తమిళంలో సెన్సేషనల్‌ హిట్‌. కానీ దాని తెలుగు రూపం 'గడ్డం గ్యాంగ్‌' వచ్చింది వెళ్లింది కూడా తెలియనంత దారుణమైన ఫ్లాప్‌. 'తను వెడ్స్‌ మను' బాలీవుడ్ లో క్లాసిక్‌. తెలుగులో 'మిస్టర్‌ పెళ్లికొడుకు' మాత్రం వరస్ట్‌ అనిపించుకుంది. ఇంకా అనామిక - ఉలవచారు బిర్యాని - ఆహా కళ్యాణం - దాగుడుమూతల దండాకోర్ - ఎర్రబస్సు - డైనమైట్‌ - మామ మంచు అల్లుడు కంచు - స్పీడున్నోడు.. ఇలా తెలుగులో గత కొన్నేళ్లలో ఫెయిలైన రీమేక్‌ ల జాబితా చాలా పెద్దదే.

రీమేక్‌ లు ఒకప్పట్లా విజయం సాధించలేకపోవడానికి కొన్ని కీలకమైన కారణాలున్నాయి. ఒకప్పుడు తమిళం నుంచో మరో భాష నుంచో ఓ సినిమాను రీమేక్‌ చేస్తున్నారంటే దాని గురించి ప్రేక్షకులకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. కానీ సాంకేతిక నైపుణ్యం బాగా పెరిగిన ఈ రోజుల్లో 'రీమేక్‌' అన్న మాట వినిపిస్తే చాలు.. ఆ సినిమా పుట్టుపూర్వోత్తరాలన్నీ నిమిషాల్లో బయటికి లాగేస్తున్నారు నేటి ప్రేక్షకులు. గూగుల్లో ఆ సినిమా పేరు కొడితే చాలు బోలెడంత సమాచారం వచ్చేస్తుంది. కథేంటి.. పాత్రలేంటి.. సినిమాలో మలుపులేంటి అన్నది ముందే తెలిసిపోతోంది. చాలామంది అంతటితో ఆగకుండా భాషా భేదం లేకుండా ఈ సినిమాల్ని చూసేస్తున్నారు కూడా. ఇలా ఓ సినిమా విశేషాల గురించి అంతా తెలిసిపోయాక ఇక ఆసక్తి ఏముంటుంది? ఇక్కడే రీమేక్‌ లు చాలా వరకు ఫెయిలవుతున్నాయి. ఇక మాతృకలోని ఆత్మను పట్టుకోలేని దర్శకుల వైఫల్యం కూడా రీమేక్‌ ల ఫెయిల్యూర్‌ కు కారణమవుతోంది.