Begin typing your search above and press return to search.

లతా మంగేష్కర్ అభిమానులకు ఊరట!

By:  Tupaki Desk   |   31 Jan 2022 8:30 AM GMT
లతా మంగేష్కర్ అభిమానులకు ఊరట!
X
కోకిల అసూయపడే స్వరం .. సప్తస్వరాలు ఇమిడిపోయిన గళం లతా మంగేష్కర్ సొంతం. ఆమె పాడితే వెన్నెల్లో విహరించినట్టుగా ఉంటుంది .. తేనె ధారాల్లో తడిసినట్టుగా ఉంటుంది .. అమృత ప్రవాహంలో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది. భారమైన మనసులకు .. బరువెక్కిన హృదయాలకు లత పాటకి మించిన విరుగుడు లేదు. మనసు రెక్కలు విప్పుకుని అనుభూతుల ఆకాశంలో ఎగరాలనుకునేవారికి ఆమె పాటకి మించిన మంత్రం లేదు. అంతలా ఆమె తన స్వరంతో ప్రభావితం చేశారు.

లత చాలా తక్కువగా మాట్లాడతారు .. ఎక్కువ పాటలు పాడతారు అని ఆమె గురించి ఉత్తరాదిన చెప్పుకుంటూ ఉంటారు. వివిధ భాషల్లో 50 వేలకి పైగా పాటలు పాడిన ఘనత ఆమె సొంతం. ముంబైలోనే కాదు .. దేశంలో ఏ మూలకి వెళ్లినా, ఆమె పాటల నుంచి తప్పించుకుని తిరగడం సాధ్యం కాదు. ఏదో ఓ మూల నుంచి తీయనైన ఆమె స్వరం వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాట పరిమళం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. దశాబ్దాల పాటు పాటల బాటలో ప్రయాణం చేసిన లతను, ఈ నెల 8వ తేదీన కరోనా కారణంగా ముంబై 'బ్రీచ్ క్యాండీ' హాస్పిటల్లో చేర్పించారు.

అయితే వయసు పై బడటం వలన .. ఇతర అనారోగ్య సమస్యల వలన ఆమె ఇబ్బందిపడుతున్నారు. లత అభిమానులంతా కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆమె కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకుంటున్నారు. తాజాగా లత ఆరోగ్య పరిస్థితి గురించి మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే మాట్లాడారు. ఇంతకుముందుతో పోలిస్తే లతా ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని ఆయన అన్నారు.

15 రోజులుగా లత వెంటిలేటర్ పై ఉన్నారనీ, ఇప్పుడు ఆమెకి వెంటిలేటర్ అవసరం లేదని వైద్యులు తనతో చెప్పారని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకి ఆక్సిజన్ అందిస్తున్నారని చెప్పారు. ఇన్ ఫెక్షన్ ఇంకా ఉందనీ .. అందువలన ఆమె కాస్త బలహీనంగా ఉన్నారని అన్నారు. అయితే ఆమె కళ్లు తెరిచి చూస్తున్నారనీ .. చికిత్సకు స్పందిస్తున్నారనీ .. కోలుకుంటున్నారని చెప్పారు. లత ఆరోగ్య పరిస్థితిని గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు, ఇది ఊరట కలిగించే విషయమేనని చెప్పుకోవాలి.