Begin typing your search above and press return to search.

జక్కన్న మీద నమ్మకం లేకనే ఇలాంటి ప్లాన్ తో వెళ్తున్నారా..?

By:  Tupaki Desk   |   18 Oct 2021 1:05 PM IST
జక్కన్న మీద నమ్మకం లేకనే ఇలాంటి ప్లాన్ తో వెళ్తున్నారా..?
X
2022 సంక్రాంతి బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారుతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన పెద్ద సినిమాలన్నీ పండుగ సీజన్ మీద పడ్డాయి. రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' - పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' - మహేష్ బాబు 'సర్కారు వారి పాట' - ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఒకేసారి నాలుగు భారీ సినిమాలు వచ్చే అవకాశం లేదని స్పష్టం అయింది. కాకపోతే ఇంతవరకూ ఎవరూ కూడా అధికారికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించలేదు.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని జనవరి 7వ తేదీన విడుదల చేస్తామని అనౌన్స్ చేయగానే.. మిగతా మూడు సినిమాల్లో రెండు వాయిదా పడతాయని వార్తలు వచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన 'రాధే శ్యామ్' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇక 'భీమ్లా నాయక్' సినిమా కూడా వెనక్కి తగ్గేది లేదని.. జనవరి 12న వస్తున్నట్లు తెలిపారు. లేటెస్టుగా 'సర్కారు వారి పాట' టీమ్ చెప్పిన తేదీకే రానున్నట్లు వెల్లడించారు.

హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 'సర్కారు వారి పాట' టీమ్ కళావతి పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్ ని వదిలారు. ఈ సందర్భంగా జనవరి 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మరోసారి వెల్లడించారు. ఇన్నాళ్లూ పోస్ట్ పోన్ అవుతుందని అనుకుంటూ వస్తున్న మహేష్ సినిమాని సంక్రాంతి బరిలో నిలపడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించడానికి కారణం రాజమౌళి మీద నమ్మకం లేకపోవడమే అని టాక్ నడుస్తోంది.

RRR సినిమా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. చివరిగా 2022 మొదటి నెలలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న సినిమామాలైనా.. ఎంత పెద్ద భారీ ప్రాజెక్ట్ అయినా.. జక్కన్న చిత్రానికి పోటీగా రిలీజ్ చేయాలని అనుకోరు. కాకపోతే రాజమౌళి మీద అపనమ్మకంతో.. ఒకవేళ అనివార్య కారణాల వల్ల 'ఆర్.ఆర్.ఆర్' అనుకున్న సమయానికి రాకపోతే అనే ఆలోచనతో ఇలాంటి మరో ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.

యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'RRR' సినిమా విడుదల తేదీని బట్టే మిగతా చిత్రాల రిలీజులు ఉంటాయనేది స్పష్టం అవుతోంది. అందులోనూ బిజినెస్ పరంగా ఆలోచించి, ఒకే సీజన్ లో నాలుగు పెద్ద సినిమాలను థియేటర్లలోకి తీసుకురావాలని డిస్ట్రిబ్యూటర్స్ కూడా అనుకోరు. కాబట్టి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చెప్పిన తేదీకి రిలీజ్ కాకపోతేనే 'సర్కారు వారి పాట' 'భీమ్లా నాయక్' సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తాయని టాక్ నడుస్తోంది. ఇది జరగకపోతే ఈ పెద్ద సినిమాలు తదుపరి రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది చివరి వరకు విడుదల తేదీలను ప్రకటిస్తున్న సమయంలో మంచి రిలీజ్ డేట్ దొరకడం అంత ఈజీ కాదు. ఏమి జరుగుతుందో చూడాలి.

ఏదేమైనా 2022 సంక్రాంతి బాక్సాఫీస్ వార్ లో దిగే సినిమాల మీద క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రస్తుతానికి అయితే 'ఆర్.ఆర్.ఆర్' - 'రాధే శ్యామ్' మధ్య పోటీ ఖాయమని అర్థం అవుతోంది. వారం గ్యాప్ తో వస్తున్న ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతున్నవే. అందులోనూ ఇవి పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయ్యే సినిమాలే అవడం గమనార్హం. మరి వీటిలో ఏవి ప్రేక్షకులను మెప్పించి సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.