Begin typing your search above and press return to search.

'ఆచార్య' ఐటమ్ లో రెజీనా రెచ్చిపోతుందట!

By:  Tupaki Desk   |   10 March 2021 10:31 AM GMT
ఆచార్య ఐటమ్ లో రెజీనా రెచ్చిపోతుందట!
X
ఐటమ్ సాంగ్ అనేది సినిమాలో ప్రధానమైన అంశంగా చేరిపోయింది .. ప్రత్యేకమైన ఆకర్షణగా మారిపోయింది. ఐటమ్ సాంగ్ లో స్టార్ హీరోయిన్లు మెరిసే ఆనవాయితి మొదలైన దగ్గర నుంచి, ఐటమ్ సాంగ్ అదనపు బలంగా తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. దాంతో ఇప్పుడు ఒక ఒక ఐటమ్ సాంగ్ కోసం భారీస్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఒక్క ఐటమ్ సాంగ్ కోసమే ఐటమ్ భామలకు కోటి రూపాయల వరకూ చెల్లించుకుంటున్నారు. మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలు ఎక్కడ ఎంత తక్కువైనా, ఐటమ్ సాంగ్ ఆ లోటును భర్తీ చేసేస్తూ ఉంటుందన్నమాట.

అలా ఐటమ్ సాంగ్ చేసే భామల్లో రెజీనా కూడా చేరిపోయింది. హీరోయిన్ గా తనకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఆమె, 'ఆచార్య' సినిమాలో చిరంజీవి సరసన ఒక ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ఈ ఐటమ్ సాంగ్ ను ఒక రేంజ్ లో ప్లాన్ చేశారట. దర్శకుడు కొరటాల శివ .. ఐటమ్ సాంగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు చిరంజీవి చేసిన 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో రాయ్ లక్ష్మితో చేసిన 'రత్తాలు .. రత్తాలు' అనే ఐటమ్ సాంగ్ మాస్ ఆడియన్స్ లోకి మిస్సైల్ లా దూసుకెళ్లింది. ఇప్పటికీ ఆ పాట జనం నాల్కలపై నాట్యం చేస్తూనే ఉంది.

అందువలన ఆ సాంగ్ కి వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న కొరటాల శివ, అంతకు ఎంతమాత్రం తగ్గకుండా 'ఆచార్య' సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండాలని భావిస్తున్నాడట. వీలైతే అంతకుమించి అనేలా ఉండాలని కృషి చేస్తున్నాడట. ఐటమ్ సాంగ్ కోసం మణిశర్మ ఇచ్చిన ట్యూన్ కుర్రాళ్లను ఒక ఊపు ఊపేయడం ఖాయమని అంటున్నారు. ఈ పాటలో రెజీనా కాస్ట్యూమ్స్ .. సొగసైన స్టెప్పులు .. ఒలకబోసే వయ్యారాలు వీలైనన్ని విజిళ్లను వసూలు చేస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాకి ఈ ఐటమ్ సాంగ్ హైలైట్ గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మే 13వ తేదీన ఈ సినిమా థియేటర్లపై విరుచుకుపడనుంది.