Begin typing your search above and press return to search.

రెబ‌ల్ స్టార్ కి సినీరాజ‌కీయ దిగ్గ‌జాల సంతాపం

By:  Tupaki Desk   |   11 Sep 2022 6:03 AM GMT
రెబ‌ల్ స్టార్ కి సినీరాజ‌కీయ దిగ్గ‌జాల సంతాపం
X
రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మృతికి సినీరాజ‌కీయ రంగాల నుంచి ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్త‌మైంది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌మ సంతాపం తెలియ‌జేసారు. కేంద్ర మాజీ మంత్రి.. బహుముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సినీప‌రిశ్ర‌మ‌తో పాటు ప్రజా జీవితంలో రెబల్ స్టార్ చేసిన కృషిని ముఖ్యమంత్రి జ‌గ‌న్ కొనియాడారు. ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కృష్ణంరాజు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రెబ‌ల్ స్టార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణంరాజు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. కేంద్ర మంత్రిగా లోక్‌సభ సభ్యునిగా కృష్ణంరాజు సేవలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.

అలాగే సినీరంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి- బాల‌కృష్ణ‌- ప‌వ‌న్ క‌ల్యాణ్‌- మ‌హేష్ బాబు- నాగార్జున‌- ఎన్టీఆర్ స‌హా ఎంద‌రో స్టార్లు త‌మ సంతాపం వ్య‌క్తం చేశారు.

పెద్ద‌న్న‌లా న‌న్ను ప్రోత్స‌హించారు: మెగాస్టార్ చిరంజీవి

కృష్ణంరాజుగారు ఇక లేరు అనే మాట ఎంతో విషాద‌క‌రం. మా ఊరి హీరో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నా తొలి రోజుల నుంచి పెద్ద‌న్న‌లా ఆప్యాయంగా ప్రోత్స‌హించిన కృష్ణంరాజుగారితో నాటి `మనవూరి పాండవులు` దగ్గర నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయ‌మైన‌ది. ఆయ‌న `రెబ‌ల్ స్టార్‌`కి నిజ‌మైన నిర్వ‌చ‌నం. కేంద్ర‌మంత్రిగానూ కూడా ఎన్నో సేవ‌ల‌ను అందించారు. ఆయ‌న లేని లోటు వ్య‌క్తిగ‌తంగా నాకు సినీ ప‌రిశ్ర‌మ‌కు ల‌క్ష‌లాది మంది అభిమానుల‌కు ఎప్ప‌టికీ తీర‌నిది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తూ కుటుంబ స‌భ్యులంద‌రికీ నా త‌మ్ముడులాంటి ప్ర‌భాస్ కి సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను..

మంచితనానికి మారుపేరు: నందమూరి బాలకృష్ణ

మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు గారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు గారితో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. కృష్ణంరాజు గారితో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. కృష్ణరాజు గారు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునేవాడిని. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

రౌద్ర‌ర‌స వీరుడు ఆయ‌న‌: ప‌వ‌న్ క‌ల్యాణ్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

మా కుటుంబంతో శ్రీ కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో శ్రీ కృష్ణంరాజు గారితో కలసి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో శ్రీ కృష్ణంరాజు గారి అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు. బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి. ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు.
సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరపున జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

సినీరంగానికి ఎన‌లేని కృషి చేశారు!- మ‌హేష్

కృష్ణంరాజు గారు ఇక లేరని తెలిసి షాక్ అయ్యాను... నాకు.. మొత్తం పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజు. ఆయన జీవితం.. ఆయన చేసిన ప‌ని.., సినిమా రంగానికి ఆయన చేసిన ఎనలేని కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ కష్ట సమయంలో ప్రభాస్ కి మరియు కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి.

స‌మాజ సేవ‌తో మ‌న‌సులు గెలిచారు: అమిత్ షా

తెలుగు సినిమా దిగ్గజ నటుడు, .. కేంద్ర మాజీ మంత్రి శ్రీ యు కృష్ణంరాజు గారు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అతను బహుముఖ నటనతో .. సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి.