Begin typing your search above and press return to search.

స్టార్ డ‌మ్ కోసం ప‌దేళ్లు వేచి చూసిన హీరో

By:  Tupaki Desk   |   11 Sep 2022 7:48 AM GMT
స్టార్ డ‌మ్ కోసం ప‌దేళ్లు వేచి చూసిన హీరో
X
ఆర‌డుగుల బుల్లెట్టు అని ఈ రోజుల్లో లిరిసిస్టులు పాట‌లు రాసారు కానీ.. ఆ రోజుల్లోనే ఆర‌డుగుల బుల్లెట్టు రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు. ఆర‌డుగుల‌ ఆజానుభాహుడి విగ్ర‌హానికి ప‌ర‌వ‌శించి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్ని కృష్ణంరాజుకు ఆఫ‌ర్ చేసారు. కెరీర్ ఆరంభం ఆయ‌న ఎన్నో విల‌న్ వేషాలు వేసారు.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ న‌టించారు. హీరోగా చేస్తూనే వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో క‌నిపించారు. కెరీర్ ప్రారంభించాక‌ దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత హీరోగా స్థిర‌ప‌డ్డారు. ద‌ర్శ‌క‌దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు ఆయ‌న విగ్ర‌హానికి త‌గ్గ‌ట్టుగా రౌడీ టైటిల్స్ తో అద్భుత‌మైన విజ‌యాల్ని అందించారు. నాటి నుంచి రెబ‌ల్ స్టార్ బిరుదాంకితుడై అభిమ‌నుల‌ను అపారంగా పెంచుకున్నారు కృష్ణంరాజు.

అప్ప‌ట్లోనే కృష్ణంరాజు భారీ విగ్ర‌హం విల‌న్ వేషాలేస్తుంటే థియేట‌ర్ల‌లో చూసిన మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు ఝ‌డుసుకునేవారు. ఆ విగ్రహం అలాంటి ముద్ర వేసేది. అయితే విల‌న్ వేషాల‌తో పాటు కాల‌క్ర‌మంలో ఎన్నో ఉధాత్త‌మైన పాత్ర‌ల్లో న‌టించి తిరిగి అదే మ‌హిళా ప్రేక్ష‌కుల‌చే జేజేలు ప్రేమాభిమానాలు అందుకున్న ఘ‌న‌త కృష్ణంరాజుకే చెల్లింది.

మెగాస్టార్ చిరంజీవికి ఆయ‌నే స్ఫూర్తి..

మెగాస్టార్ చిరంజీవి న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన క్ర‌మంలో కృష్ణంరాజు ఎంతో ప్రోత్స‌హించారు. ఆ ఇద్దరిదీ మొగల్తూరే కావ‌డంతో ఎంతో స్నేహంగా ఉండేవారు. చిరంజీవితో స్నేహానికి కృష్ణం రాజు ప్రాధాన్యత ఇచ్చారు. కెరీర్ ఆరంభం ఆ ఇద్ద‌రూ క‌లిసి క‌థానాయ‌కులుగానూ న‌టించారు. చిరు ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన కొత్త‌లో రేడియో పాట‌లు విన్నా డ్యాన్సుల‌తో ఉర్రూత‌లూగించేవారు. అది చూసిన కృష్ణంరాజు చాలా ఇంప్రెస్ అయ్యి ప్రోత్స‌హించేవారు. ``అప్పడే చెప్పాను నీలో మంచి రిథమ్ ఉంది రా అబ్బాయ్.. చాలాఎత్తుకి ఎదుగుతావ్ అని చెప్పా`` అంటూ ఓ ఇంట‌ర్వ్యూలోనూ వెల్ల‌డించారు.

ఓసారి చిరు పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు వెళ్లిన కృష్ణంరాజు అక్క‌డ జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న గురించి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. నేను నా మేన‌ల్లుడు చిరు బ‌ర్త్ డేకి వెళ్లాం. అక్క‌డ నా మేన‌ల్లుడు మెడ‌లో కెమెరాను త‌గిలించుకుని ఫోటోలు తీస్తున్నాడు. ఆ కెమెరాను చూసిన చిరంజీవి. ఇది ఎక్క‌డిది అన్నా.. చాలా ఖ‌రీదైన‌ది.. లండ‌న్ లో చూశాను. ధ‌ర చూసి కొన‌లేదు అని అన్నాడు. వెంట‌నే మేన‌ల్లుడి మెడ‌లోంచి ఆ కెమెరాని తీసి చిరు మెడ‌లో త‌గిలించాను. ఇదే నీ బ‌ర్త్ డే గిఫ్ట్! అన్నాను. దానికి అత‌డు ఆశ్చ‌ర్య‌పోయాడు! అని కృష్ణంరాజు త‌మ మ‌ధ్య అనుబంధం గురించి తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే...

దాదాపు 180 పైగా చిత్రాల్లో న‌టించిన రెబ‌ల్ స్టార్ కె.ప్ర‌త్య‌గాత్మ రూపొందించిన‌`చిల‌క‌-గోరింక‌`(1966)తో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. దాదాపు ప‌దేళ్ళ‌కు కృష్ణంరాజు స్టార్ డ‌మ్ ని అందుకోగ‌లిగారు. అప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఎన్నో పాత్ర‌ల్లో న‌టించారు.చివ‌రికి జ‌నం మ‌దిలో `రెబ‌ల్ స్టార్`గా నిలిచారు. పుష్క‌ర‌కాలం ప్ర‌య‌త్నించి స్టార్టుగా నిలిచిన వారు ఇద్ద‌రే ఇద్ద‌రు. శోభ‌న్ బాబు- కృష్ణంరాజు అలా స్వ‌యంకృషితో నిల‌దొక్కుకున్న హీరోలుగా పేరు బ‌డ్డారు. ఆ ఇద్ద‌రినీ ఎన్టీఆర్ - ఏయ‌న్నార్ ఎంత‌గానో ప్రోత్స‌హించారు. త‌మ చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో నటింప‌జేసి కెరీర్ ప‌రంగా ఇతోధికంగా సాయం చేసారు. కానీ సొంత ముద్ర వేసేందుకు కృష్ణంరాజు కు చాలా స‌మ‌యం ప‌ట్టింది.

శోభ‌న్ బాబు స్ఫూర్తితోనే హీరోగా.. సైడ్ హీరోగా.. క్యారెక్ట‌ర్ న‌టుడిగా సాగుతూ చివ‌ర‌కు `తాసిల్దార్ గారి అమ్మాయి`తో పెద్ద విజ‌యం అందుకున్నారు. ఈ సినిమా స్టార్ డ‌మ్ ని పెంచింది. కానీ వెంట‌నే హీరోగా స్థిర‌ప‌డిపోలేదు. విల‌న్ పాత్ర‌లు చేస్తూ వాటిలో మెప్పించేవారు. ఆర‌డుగుల విగ్ర‌హంతో అత‌డిని విల‌న్ గా తెర‌పై చూసిన మ‌హిళా ప్రేక్షకులు ఆయ‌న పేరు చెప్ప‌గానే ఝ‌డుసుకొనేవారు. అలాంటి కృష్ణంరాజు ఆ ముద్ర నుండి బ‌య‌ట ప‌డ‌డానికి `కృష్ణ‌వేణి- అభిమాన‌వంతులు- మేమూ మ‌నుషుల‌మే` వంటి చిత్రాల‌లో సాఫ్ట్ పాత్ర‌ల‌తో మెప్పించారు. అనుకున్న‌వేవీ ఆడ‌క‌పోయినా కానీ మెల్ల‌గా కృష్ణంరాజును కూడా హీరోగా చూడ‌డానికి జ‌నం అల‌వాటు ప‌డేలా చేసుకున్నారు. ఆ త‌రువాత `భ‌క్త క‌న్న‌ప్ప‌`తో అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని అందుకున్నారు. `అమ‌ర‌దీపం` చిత్రంతో నంది ఉత్త‌మ న‌టుడిగా రికార్డులకెక్కారు. దాస‌రి నారాయ‌ణ‌రావు రూపొందించిన క‌ట‌క‌టాల రుద్ర‌య్య‌- రంగూన్ రౌడీ చిత్రాలు కృష్ణంరాజును `రెబ‌ల్ స్టార్`గా నిలిపాయి. అటుపై కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. శోభ‌న్ బాబు- కృష్ణంరాజు స్ఫూర్తితోనే మెగాస్టార్ చిరంజీవి న‌టుడిగా ఎదిగారు. ఈ విష‌యాన్ని ఆయ‌న చాలాసార్లు వెల్ల‌డించారు. కృష్ణంరాజును అన్నా అని పిలిచేంత చ‌నువు చిరుకి ఉంది. ఆ త‌ర్వాత చిరంజీవి స్ఫూర్తితో ర‌వితేజ‌-శ్రీ‌కాంత్ లాంటి స్టార్లు ఎదిగారు. ఇలా న‌వ‌త‌రం స్టార్లు అవ్వ‌డానికి కృష్ణంరాజు కూడా ఒక మూల పురుషుడిగా స్ఫూర్తిగా నిలిచారంటే అతిశ‌యోక్తి కాదు.

కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 83. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన ఆయన 1966లో చిలకా గోరింక చిత్రంతో న‌టుడ‌య్యారు. `అవే కళ్లు` చిత్రంలో అతని ప్రతినాయకుడి నటన అతని నటనా సామర్థ్యాన్ని నిరూపించుకోవడంతో పాటు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. తర్వాత తన సినీ జీవితంలో ఎమోషన్స్ ఎక్కువగా ఉండే పాత్రలు చేస్తూ మెప్పించారు.

కృష్ణంరాజు నటించిన హంతకులు దేవాంతకులు- భక్త కన్నప్ప- తాండ్ర పాపారాయుడు- బొబ్బిలి బ్రహ్మన్న- రంగూన్ రౌడీ- త్రిశూలం- కటకటాల రుద్రయ్య- మన వూరి పాండవులు- టూ టౌన్ రౌడీ- పల్నాటి పౌరుషం సినిమాలు ఆయన తరంలో ఘనమైన తిరుగులేని యాక్షన్ స్టార్ గా తన స్థానాన్ని ప‌దిలం చేసాయి.

నిర్మాతగా కృష్ణంరాజు తన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై భక్త కన్నప్ప- తాండ్ర పాపారాయుడు- బిల్లా వంటి బ్లాక్ బస్టర్ లను నిర్మించారు. ఈ బ్యానర్ లో అతని చివరి చిత్రం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్.

1991లో రాజకీయ ప్రవేశం చేసిన కృష్ణంరాజు.. 1999లో నర్సాపురం నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు.

కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి.. కుమార్తెలు ప్రసీది- ప్రకీర్తి- ప్రదీప్తి ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.