Begin typing your search above and press return to search.

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇక లేరు

By:  Tupaki Desk   |   11 Sep 2022 2:45 AM GMT
రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇక లేరు
X
తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో విషాదకరమైన రోజు ఇది. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. దివంగత నటుడి క‌డ‌సారి చూపున‌కు అభిమానుల కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి.

20 జనవరి 1940న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు 187 సినిమాలు ఉన్నాయి. 1966లో `చిలకా గోరింక` చిత్రంతో కృష్ణంరాజు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అటల్ బిహారీ వాజ్ పేయి క్యాబినెట్ లో కేంద్ర మంత్రిగా పనిచేసిన తొలి నటుడు ఆయ‌న‌.

కృష్ణంరాజు మరణవార్త ఆయన అభిమానులను కలచివేసింది. ఆయన మృతి పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

వెట‌ర‌న్ నటుడిగా నిర్మాతగా ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు అలియాస్ కృష్ణం రాజు టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం కెరీర్ ని ర‌న్ చేసారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు.

కృష్ణంరాజు కెరీర్ ఆరంభం చాలా సినిమాల్లో విలన్ గా నటించారు. అతను చివరికి హీరోగా రూపాంత‌రం చెందారు. ఆ రోజుల్లోనే ల‌క్ష‌లాదిగా యువకుల హృదయాలను గెలుచుకున్నాడు. కృష్ణంరాజు దాదాపు 183 సినిమాల్లో నటించ‌గా అత‌డిలోని రెబ‌లిజానికి జేజేలు ప‌లికింది యూత్. అందుకే ఆయ‌న‌ను రెబ‌ల్ స్టార్ అనే బిరుదుతో స‌త్క‌రించారు. కృష్ణం రాజు చివరిసారిగా ఈ సంవత్సరం విడుదలైన ప్రభాస్ `రాధే శ్యామ్‌`లో న‌టించారు.

గోపీ కృష్ణ మూవీస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్ ను ప్రారంభించి అనేక సినిమాల‌ను నిర్మించారు. న‌టుడిగా కెరీర్ లో అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు.. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ నంది అవార్డులను కూడా గెలుచుకున్నాడు. తాండ్ర పాపారాయుడు- భక్త కన్నప- బొబ్బిలి బ్రహ్మన్న- బావ బావమరిది- ధర్మాత్ముడు- జీవన తరంగాలు- కృష్ణవేణి అత‌డు న‌టించిన పాపుల‌ర్ సినిమాలు.

కృష్ణంరాజు మృతి పట్ల టాలీవుడ్ నటీనటులు- సాంకేతిక నిపుణులు సంతాపం తెలిపారు. రెబల్ స్టార్ హఠాన్మరణం వారి కుటుంబానికి టాలీవుడ్ కి తీర‌ని లోటు. ఈరోజు అంత్యక్రియలు జరగనున్నాయి. మహానటుడు కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులకు `తుపాకి` ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.