Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఇగో ఎక్కువనా?

By:  Tupaki Desk   |   8 May 2020 4:41 PM GMT
టాలీవుడ్ లో ఇగో ఎక్కువనా?
X
ప్రస్తుతం టాలీవుడ్‌ లో మల్టీస్టారర్‌ చిత్రాలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ చిత్రాలపై అటు ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ఆసక్తిని చూపుతున్నారు. వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. సినీ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుండి వస్తున్నదే. బాలీవుడ్ లో అప్పటి నుండి ఇప్పటి దాకా మల్టీస్టారర్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. అక్కడ స్టార్ హీరోలు ఇమేజ్ అని.. స్టార్ డమ్ అని.. ఫ్యాన్స్ ఒపీనియన్స్ అని ఏమీ పట్టించుకోకుండా ఇతర స్టార్ హీరోలతో నటించడానికి ముందుకు వస్తుంటారు. స్టార్ హీరోలు కలిసి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు.

మల్టీస్టారర్‌ విషయంలో టాలీవుడ్ బాగా వెనకబడిపోయిందని చెప్పవచ్చు. స్టార్ హీరోలు కలిసి నటిస్తేనే ఆ సినిమాకి ఉండే క్రేజ్ వేరని చెప్పొచ్చు. కానీ మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఒక ఫంక్షన్ లో కలిస్తేనే గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఇక అలాంటిది స్క్రీన్ మీద కనిపిస్తే. అలాంటి సినిమా వేరే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఒక దశలో సౌత్ సినీ ఇండస్ట్రీలలో మల్టీస్టారర్ సినిమాలు చాలానే వచ్చాయి. క్రమక్రమంగా అలాంటి సినిమాలు తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ లో మల్టీస్టారర్ అనే పదం చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన స్టార్ హీరోలు ఇతర స్టార్ హీరోలతో కలిసి నటించడానికి పెద్దగా ఆసక్తి చూపరనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం.

అంతేకాకుండా ఇమేజ్.. స్క్రీన్ స్పేస్.. ఫ్యాన్స్ ఒపీనియన్స్ అనే అనేక విషయాలు అడ్డు వస్తాయని చెప్తారు మన హీరోలు. కొంతమంది మంది హీరోలు మాత్రం నటించడానికి మేము రెడీగా ఉన్నాం.. కానీ సరిపడే స్టోరీతో ఎవరు ముందుకు రావడం లేదంటారు. కానీ మల్టీస్టారర్ చిత్రాలను తీసేందుకు మన దర్శకులు ఎప్పుడు రెడీగా ఉంటారు. స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌ లో చూడాలని సినీ అభిమానులు ఆశిస్తూ ఉంటారు. దర్శకులు కూడా స్టార్ హీరోలను ఒకేసారి డైరెక్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన డైరెక్టర్లు కూడా మల్టీస్టారర్ స్క్రిప్ట్స్ చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు లాంటి దర్శకుడే అప్పటి మన హీరోలతో స్క్రిప్ట్ రెడీ చేసుకొని కూడా మల్టీస్టారర్ తీయలేకపోయాడంటే అర్థం చేసుకోవచ్చు టాలీవుడ్ హీరోల ఆలోచనా విధానం.

టాలీవుడ్‌ లో మొదటి తరం హీరోలు మల్టీస్టారర్ మూవీలు చేయడానికి ఆలోచించేవారు కాదు. అక్కినేని నాగేశ్వరరావు - ఎన్టీఆర్ - కృష్ణ - కృష్ణం రాజు - శోభన్ బాబు ఇలా అందరు హీరోలు కలిసి నటించిన వారే. కానీ తరవాతి జనరేషన్ లో చిరంజీవి - నాగార్జున.. నాగార్జున - బాలకృష్ణ.. బాలకృష్ణ - చిరంజీవి.. బాలకృష్ణ - వెంకటేష్.. నాగార్జున - వెంకటేష్ ఇలాంటి కాంబినేషన్స్ ఎందుకు సెట్ అవలేదు. ఎందుకంటే మన స్టార్ హీరోలు ఇతర హీరోలతో కలిసి నటించడానికి వారికి ఇగోలు అడ్డు వస్తాయని సినీ విశ్లేషకులు చెప్తుంటారు. అయితే ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం ప్రయోగాలు చేయడానికి అంతో ఇంతో ఇష్ట పడుతున్నారని చెప్పవచ్చు. అందుకే గతంతో పోలిస్తే ఇప్పుడు మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ కోసం విక్టరీ వెంకటేశ్ - సూపర్ స్టార్ మహేష్‌ బాబు లాంటి స్టార్ హీరోలు కలిశారు. ఆ తర్వాత ‘గోపాల గోపాల' 'మసాలా' ‘ఎఫ్ 2' ‘వెంకీమామ' వంటి సినిమాలు వచ్చాయి. కానీ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ఇద్దరు హీరోలు కలిసి నటించడం అన్నది జరగలేదనే చెప్పాలి.

కానీ 'ఆర్.ఆర్.ఆర్' సినిమా వాటికి బ్రేక్ వేసిందని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో మల్టీస్టారర్‌ చిత్రాలను తీసేందుకు దర్శకనిర్మాతలు సైతం చాలా ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం నాని - సుధీర్ బాబు కలిసి 'వి' సినిమాలో నటించారు. అలాగే ‘ఆచార్య'లో చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. వీటితో పాటు 'లూసీఫర్' రీమేక్ - ‘మహాసముద్రం' ‘ఎఫ్ 3' సినిమాలు కూడా మల్టీస్టారర్స్ గా రానున్నాయి. అయితే మహేష్ - పవన్... ప్రభాస్ - మహేష్... బన్నీ - మహేష్.. ప్రభాస్ - పవన్ కళ్యాణ్ లాంటి కాంబినేషన్స్ రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. నిజంగా వారు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. అదే కనుక జరిగితే టాలీవుడ్ కూడా మార్కెట్ పరంగా బాలీవుడ్ ని బీట్ చేసే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. మరి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తర్వాత అయినా మన స్టార్ హీరోలు ఇగోలు.. ఇమేజ్.. స్క్రీన్ స్పేస్.. ఫ్యాన్స్ ఒపీనియన్స్ అనే విషయాలు పక్కన పెట్టి కలిసి నటిస్తారేమో చూడాలి.