Begin typing your search above and press return to search.

‘సైరా’లో ఆయన పారితోషకమంతా దానికే..

By:  Tupaki Desk   |   1 April 2018 7:08 AM GMT
‘సైరా’లో ఆయన పారితోషకమంతా దానికే..
X
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడున్న స్థితిలో దక్షిణాదిన ఓ సినిమా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఆయన మాత్రం తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఒప్పుకుని ఆశ్చర్యపరిచారు. ఈ చిత్ర బృందం ఇందులో అమితాబ్ నటించనున్నట్లు ముందు ప్రకటించినపుడు జనాలకు నమ్మకం కలగలేదు. అమితాబ్ ఈ చిత్రంలో నటించబోతున్న విషయాన్న ధ్రువీకరించకపోవడంతో సందేహాలు పెరిగాయి. కానీ ఇటీవలే అమితాబ్ హైదరాబాద్ వచ్చి.. రెండు రోజుల షూటింగ్ లో పాల్గొని వెళ్లారు. ఇంతటితో ఆయన పార్ట్ పూర్తయింది. ఇక్కడ షూటింగ్ అవుతుండగానే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఫొటోలు అమితాబ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్న సంగతి తెలిసిందే.

ఐతే అమితాబ్ తొందరపడి ఫొటోలు లీక్ చేసేశారేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ‘సైరా’ టీం ఉద్దేశపూర్వకంగానే అమితాబ్ ద్వారా ఈ ఫొటోల్ని షేర్ చేయించిందన్న విషయం ఆ తర్వాత అర్థమైంది. ‘సైరా’ను తెలుగుతో పాటు తమిళం.. హిందీలోనూ రూపొందిస్తున్నారు. ‘బాహుబలి’ తరహాలో ఇండియా అంతటా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలన్నది చిత్ర బృందం ప్లాన్. అందుకే చిన్న పాత్రే అయినా అమితాబ్ తో చేయించారు. బాలీవుడ్ కు చెందిన అమిత్ త్రివేదిని సంగీత దర్శకుడిగా ఎంచుకుంటున్నారు. ఐతే ఈ చిత్రానికి ముందు నుంచే ప్రచారం కల్పించడం కోసమే అమితాబ్ ద్వారా ఆన్ లొకేషన్ స్టిల్స్ రిలీజ్ చేయించారు. అమితాబ్ కు సోషల్ మీడియాలో కోట్లల్లో ఫాలోవర్లున్నారు. ఆయన ఒక ట్వీట్ వేస్తే వచ్చే ప్రచారమే వేరు. ‘సైరా’ కోసం ఆయన పని చేసింది రెండు రోజులే అయినా.. ఆయనకు కోట్లల్లో పారితోషకం ఇచ్చినట్లు సమాచారం. ఇది ఆయన నటన కోసం ఇస్తున్నది కాదు. ఆయన జాతీయ స్థాయిలో చేసి పెట్టే ప్రచారానికి ఇస్తున్న పారితోషకం అన్నమాట. సినిమా విడుదలకు ముందు మరింతగా అమితాబ్ ప్రచార సేవల్ని ఉపయోగించుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. హిందీలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసే ప్రధాన బాధ్యత ఆయనదే.