Begin typing your search above and press return to search.

కృష్ణ ఎందుకు సినిమాలు మానేశారు?

By:  Tupaki Desk   |   6 Aug 2018 7:21 AM GMT
కృష్ణ ఎందుకు సినిమాలు మానేశారు?
X
350కి పైగా సినిమాలు చేసిన ఘన చరిత్ర సూపర్ స్టార్ కృష్ణది. ఒక సమయంలో ఏడాదిలో నెలకో సినిమా రిలీజ్ చేసిన ఘనుడాయన. అలుపెరగకుండా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారాయన. కానీ గత దశాబ్ద కాలంలో కృష్ణ సైలెంటుగా ఉన్నారు. ఆయన దాదాపుగా సినిమాలు మానేశారు. ఆ మధ్య ‘శ్రీశ్రీ’ అనే సినిమా ఒకటి చేశారు కానీ.. అది వచ్చింది వెళ్లింది తెలియదు. కనీసం కృష్ణ క్యారెక్టర్ రోల్స్ అయినా చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు కానీ.. ఆయన మాత్రం దాదాపుగా సినిమాలు మానేసినట్లే కనిపిస్తున్నారు. ‘గూఢచారి’లో ఒక పాత్ర చేయాలని తాను అడిగినా కూడా సున్నితంగా తిరస్కరించినట్లు అడివి శేష్ ఇటీవలే వెల్లడించాడు. తాను సినిమాలకు పూర్తిగా దూరం కావడంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృష్ణ స్పందించాడు.

ఇంతకుముందు తాను ‘మల్లన్న’.. ‘బలాదూర్’ లాంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించానని.. కానీ అందులో తన బాడీ లాంగ్వేజ్ కొంచెం తేడాగా ఉండటంతో అభిమానులు బాధపడ్డారని కృష్ణ చెప్పాడు. తన నడక మారిందని కొందరు అభిమానలు చెప్పారని కృష్ణ వెల్లడించాడు. ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి.. ఇప్పుడు మళ్లీ ఆ పేరు పోగొట్టుకోవడం ఎందుకనిపించిందని.. ఆర్టిస్టు అన్నాక పర్ఫెక్టుగా ఉండాలనుకున్నానని.. అందుకే చిన్న కంప్లైంట్ ను కూడా పెద్దదిగా భావించి సినిమాలు మానేశానని కృష్ణ అన్నారు. ఐతే ఏ టీవీ ఛానెల్ పెట్టినా ప్రతి రోజూ తన సినిమా ఏదో ఒకటి ప్లే అవుతూనే ఉంటుందని.. కాబట్టి తాను సినిమాలకు దూరమైన భావన అభిమానులకు ఉండదని ఆయనన్నారు. తాను సినిమాలు చూడటం మానలేదని.. ఇంట్లో హోమ్ థియేటర్ ఉందని.. ఒక సినిమా బాగుందన్న టాక్ వస్తే దాన్ని ఇంట్లోనే చూసేలా ఏర్పాటు చేసుకుంటానని కృష్ణ తెలిపారు.