Begin typing your search above and press return to search.

ర‌ష్మికను నిజంగా ఇష్ట‌ప‌డుతున్నాను!-విజ‌య్ దేవ‌ర‌కొండ‌

By:  Tupaki Desk   |   29 July 2022 3:09 PM GMT
ర‌ష్మికను నిజంగా ఇష్ట‌ప‌డుతున్నాను!-విజ‌య్ దేవ‌ర‌కొండ‌
X
కాఫీ విత్ క‌ర‌ణ్ 7 లో సంచ‌ల‌న ర‌హ‌స్యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజా ఎపిసోడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ గుట్టును కూడా క‌ర‌ణ్ బ‌య‌టికి లాగాడు. రష్మిక మందనతో తన ప్రేమాయ‌ణం గురించి అత‌డు ప్రశ్నించగా.. విజయ్ దేవరకొండ ఏదీ దాచ‌కుండా ఓపెన‌య్యాడు. ఇంత‌కీ అందాల ర‌ష్మిక‌తో విజ‌య్ ప్రేమ‌లో ఉన్నాడా? అన్న‌దానికి స‌మాధానం ఇక్క‌డ ఉంది.

కరణ్ జోహార్ కాఫీ విత్ క‌ర‌ణ్ షో ఏడవ సీజన్ తో కొన్ని వారాలుగా బోలెడంత సంద‌డి చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.. కరణ్ ఈసారి OTTలో త‌న షోని స్ట్రీమింగ్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే నాలుగు ఎపిసోడ్లు స్ట్రీమ్ కాగా ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి. టాప్ టీఆర్పీతో షో దూసుకుపోతోంది. ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా కొత్త ఎపిసోడ్ ల విడుదల కోసం ఎదురుచూస్తున్నారంటే షో ఎంత‌గా స‌క్సెసైందో అర్థం చేసుకోవ‌చ్చు. అక్షయ్ కుమార్ - సమంతా రూత్ ప్రభు- సారా అలీ ఖాన్ - జాన్వీ కపూర్- రణ్‌వీర్ సింగ్ - అలియా భట్ ల‌తో ఎపిసోడ్ లు ముగిశాయి. వీటిలో తార‌ల సంచ‌ల‌న ర‌హ‌స్యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

కాఫీ విత్ కరణ్ 7 తాజా ఎపిసోడ్ లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ .. లైగ‌ర్ బ్యూటీ సహనటి అనన్య పాండే క‌నిపించారు. ఈ జంట ఎపిసోడ్ ఓవర్-ది-టాప్ ఎంటర్ టైన్ మెంట్ లో వెరీ స్పెష‌ల్ గా నిలిచింది. ఈ షోలో పుష్ప‌: ది రైజ్ నటి రష్మిక మందన తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎఫైర్ గురించి క‌ర‌ణ్ ప్ర‌శ్నించ‌గా అది హీటెక్కించింది. కరణ్ జోహార్ ప్రశ్నకు దేవరకొండ స‌మాధాన‌మిస్తూ.. ``నా కెరీర్ ప్రారంభ దశలో మేము కలిసి రెండు సినిమాలు చేసాము. ఆమె ఒక డార్లింగ్ .. నేను త‌న‌ను నిజంగా ఇష్టపడుతున్నాను. మేము నిజంగా మంచి స్నేహితులం. ప్ర‌తిదీ ఒక‌రికొక‌రం షేర్ చేసుకుంటాం. ఈ రంగంలో ఉత్తాన‌ప‌త‌నాలు మాకు ఉన్నాయి. వీటితోనే ఒక బంధం ఏర్పడుతుంది`` అంటూ తెలివిగా జ‌వాబు ఇచ్చాడు.

కరణ్ మ‌ళ్లీ మాట క‌లిపేస్తూ.. రిలేష‌న్ షిప్స్ విష‌యంలో విజయ్ అనుస‌రించే రహస్య వైఖరిని ప్రోత్సహించాడు. దీనికి దేవ‌ర‌కొండ ప్రత్యుత్తరం ఇస్తూ, ``నేను ప్రేమ‌లో ప‌డితే ప్ర‌తిదీ బిగ్గరగా చెబుతాను... అప్పటి వరకు నన్ను ఆరాధించే వారిని బాధపెట్టడం నాకు ఇష్టం ఉండదు. చాలా మంది నటుడిగా మ‌మ్మ‌ల్ని ప్రేమిస్తారు .. మా పోస్టర్ ను వారి గోడలపై.. ఫోన్‌లలో ఉంచారు. వారు నాకు చాలా ప్రేమను ప్రశంసలను ఇస్తారు. అందుకే నేను వారి హృదయాలను విచ్ఛిన్నం చేయాలనుకోలేదు`` అని అన్నాడు.

విజ‌య్ తో ప్రేమాయ‌ణం సాగించేందుకు తాము సిద్ధ‌మేన‌ని సారా అలీఖాన్- జాన్వీ క‌పూర్-అన‌న్య పాండే లాంటి న‌వ‌త‌రం నాయికలు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ స‌ర‌స‌న న‌టించేందుకు స‌ద‌రు భామ‌లు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. విజ‌య్ కి బాలీవుడ్ బ్యూటీల‌తో పాటు ఉత్త‌రాదినా బోలెడంత ఫాలోయింగ్ పెరిగింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ లైగర్ విడుద‌ల‌ కోసం వేచి చూస్తున్నాడు. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నాడు. అత‌డు ముంబై స‌హా ఉత్త‌రాదిన ప్ర‌చారం ఉత్సాహంగా చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన పాన్-ఇండియా చిత్రంలో అనన్య పాండే కూడా నటించింది. విజ‌య్ త‌దుప‌రి స‌మంత‌తో క‌లిసి ఒక ప్రేమ‌క‌థా చిత్రం `ఖుషీ`లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.