Begin typing your search above and press return to search.

పవన్ ఎపిసోడ్ లోకి పోసాని ఎంట్రీ వెనుక అసలు లెక్కలు వేరేనా?

By:  Tupaki Desk   |   29 Sept 2021 12:00 PM IST
పవన్ ఎపిసోడ్ లోకి పోసాని ఎంట్రీ వెనుక అసలు లెక్కలు వేరేనా?
X
ఏది ఉత్తినే జరగదు. అందునా రాజకీయ.. సినిమా రంగాల్లో చోటు చేసుకునే ప్రతి అంశం వెనుక అసలు లెక్కలు వేరుగా ఉంటాయని చెబుతారు. అందుకు తగ్గట్లే తాజా పరిణామాలు ఉండటం గమనార్హం. మరే విషయమో ఎందుకు? చాలా కాంప్లికేటెడ్ గా మారిన పోసాని వ్యాఖ్యల్ని.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా అందరూ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న వైనం తెలిసిందే. అసలు ఆయన ఎందుకు మాట్లాడారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. రిపబ్లిక్ ప్రీరిలీజ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారన్న మాట వినిపిస్తుంది.

ఒక మంత్రిని ఉద్దేశించి సన్నాసి అన్న మాట అన్నందుకు పోసాని తానింతలా రియాక్టు అయినట్లుగా ఆయనకు ఆయన జస్టిఫికేషన్ ఇవ్వటం తెలిసిందే. తాను ఏదైనా నిజాల్ని మాత్రమే మాట్లాడతానని చెప్పే పోసాని మాటల్లో నిజం ఎంతన్నది బహిరంగ రహస్యమే. ఇక.. పవన్ కల్యాణ్ ఇప్పుడే ఇంత ఆవేశంగా మాట్లాడారా? గతంలో మాట్లాడలేదా? అన్న ప్రశ్నను వేస్తే.. ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా? అన్న సమాధానం వస్తుంది.

మరి..మిగిలిన సందర్భాల్లో స్పందించని పోసాని.. ఇప్పుడే ఎందుకిలా మాట్లాడారు? గతంలో అన్న మాటలకు హర్ట్ కాని పోసాని.. ఈసారి మాత్రమే ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? లాంటి సందేహాలు కలుగుతాయి. ఒకవేళ అలాంటి అనుమానం కలగకపోతే మనమేం చేయలేం కానీ.. అనుమానం కలిగిన వాళ్లు మాత్రం ఈ విషయాన్ని చదివేందుకు కంటిన్యూ కావొచ్చు. ఎందుకంటే.. ప్రతి విషయాన్ని భావోద్వేగాలకు అతీతంగా.. సాపేక్షంగా చూసినప్పుడు విషయాలు అర్థం కావటంతో పాటు.. అసలు ఉద్దేశాలు ఏమిటో అర్థమవుతాయి. అలాంటి వేళలో అనవసరమైన ఆవేశాలకు గురి కాకుండా.. అసలు విషయం ఇదా? అన్న కంక్లూజన్ తో కొన్ని తలనొప్పులు తొలిగే అవకాశం ఉంది. అందుకే ఇదంతా.

మళ్లీ పాయింట్ లోకి వెళితే.. గతంలో పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడిన సందర్భంలో స్పందించని పోసాని.. ఇప్పుడు మాత్రం ఇంత ఘాటుగా రియాక్టు కావటం వెనుక.. ‘మా’ ఎన్నికలన్న మాట బలంగా వినిపిస్తోంది. అప్పటికిఇప్పటికి తేడా ఏమిటంటే.. గతంలో పవన్ ఆవేశంగా మాట్లాడిన ఏ సందర్భంలోనూ ‘మా’ ఎన్నికలు జరగలేదు. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. అందులో మెగా వర్గం ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇస్తుందన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఇప్పటివరకు అధిక్యతలో ఉన్న మెగా వర్గాన్ని చీల్చటంతో పాటు..కొంత భావోద్వేగాన్ని రగల్చటం ద్వారా.. ‘మా’ ఎన్నికల మీద ప్రభావాన్ని చూపించాలన్న వ్యూహం ఉందంటున్నారు. ఈ కారణంగానే ఆయన శ్రుతిమించి మాట్లాడుతున్నారంటున్నారు. ఈ వాదనలో నిజం ఎంతన్నది ఒక ప్రశ్న అయితే.. లాజిక్కుకు సరిగ్గా సరిపోయేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.