Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'ఆర్డీఎక్స్ లవ్'

By:  Tupaki Desk   |   11 Oct 2019 8:58 AM GMT
మూవీ రివ్యూ : ఆర్డీఎక్స్ లవ్
X
చిత్రం : 'ఆర్డీఎక్స్ లవ్'

నటీనటులు: పాయల్ రాజ్‌ పుత్ - తేజస్ - ఆదిత్య మీనన్ - నాగినీడు - తులసి - నరేష్ - ఆమని - చమ్మక్ చంద్ర తదితరులు
సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
మాటలు: పరశురాం
నిర్మాత: సి.కళ్యాణ్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శంకర్ భాను

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన కథానాయిక పాయల్ రాజ్ పుత్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘ఆర్డీఎక్స్ లవ్’. ఒక రొమాంటిక్ టీజర్, ఆ తర్వాత దానికి భిన్నమైన ట్రైలర్ తో చర్చనీయాంశంగా మారిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అలివేలు (పాయల్ రాజ్ పుత్) ఓ పల్లెటూరి నుంచి సిటీకి వచ్చి కొంత మంది అమ్మాయిలతో కలిసి సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. కండోమ్ ల వినియోగంపై అవగాహన పెంచడం.. మద్యం- గుట్కాలు లాంటి దురలవాట్లను మాన్పించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్న అలివేలును చూసి ఇంప్రెస్ అయిన సిద్ధు (తేజస్) ఆమెకు సహకారం అందిస్తూ తన ప్రేమలో కూడా పడతాడు. అలివేలు కూడా అతడికి ఆకర్షితురాలవుతుంది. అయితే తన కొడుకును వలలో వేసుకుందన్న కారణంతో అలివేలు మీద సిద్ధు తండ్రి దాడి చేయిస్తాడు. అప్పుడే అలివేలు ఇదంతా చేయడం వెనుక పెద్ద లక్ష్యం ఉందని వెల్లడవుతుంది. ఇంతకీ ఆ లక్ష్యమేంటి.. అలివేలు దాన్ని సాధించిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హీరో బైకేసుకుని వెళ్లి ఒక ఇంటి ముందు ఆగుతాడు. చుట్టూ జనాలున్నా పట్టించుకోకుండా పెంట్ హౌస్ లో ఉన్న తన స్నేహితులకు వినిపించేలా గట్టిగా అరుస్తాడు. ‘నాకు తెలియకుండా మీరు మంచి ఫిగర్ ను తెచ్చుకుని ఎంజాయ్ చేస్తారా.. ఇంతకుముందైతే చెత్త ఫిగర్లను తెచ్చుకున్నారు కాబట్టి లైట్ తీసుకున్నా.. కానీ ఈసారి మంచి ఫిగరొచ్చిందట కదా’ అంటాడు. అంతలో అతడి ఫ్రెండొచ్చి.. ‘ఒరేయ్ అది ఫిగర్ కాదురా. మనవాడి గర్ల్ ఫ్రెండ్’ అంటాడు. అయినా హీరో నమ్మడు. అంతలో ఆ ఇంటి ఓనర్ హీరో దగ్గరికొచ్చి.. ‘వాళ్లు చెబుతోంది నిజమే బాబూ. తెచ్చుకున్నది కాల్ గర్ల్ ఏమో అని నేను కూడా షేరింగ్ అడిగాను. కానీ మీవాడి గర్ల్ ఫ్రెండ్ అని చెబితే డిజప్పాయింట్ అయ్యాను’ అంటాడు. ఇదీ సోకాల్డ్ బోల్డ్ ఫిలిం ‘ఆర్డీఎక్స్ లవ్’లో ప్రారంభ సన్నివేశం. దీంతోనే ఇది ఏ ‘స్థాయి’ సినిమానో ఆరంభంలోనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. ఇక ఆ తర్వాత చూడాలి విడ్డూరాలు.

హీరోయిన్ ఒక బ్యాచ్ ను వేసుకుని కండోమ్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఆమెను చూసి ఇంప్రెస్ అయిపోయిన హీరోగారు.. అర్ధరాత్రి వేళ తనుండే హాస్టల్ దగ్గరికెళ్లి నా గర్ల్ ఫ్రెండ్ అర్జెంటుగా ఇంటికి రమ్మంది.. నా దగ్గర కండోమ్స్ లేవు.. షాపులన్నీ క్లోజ్.. మీరే నాకు కండోమ్స్ ఇప్పించాలి అంటుంది. పాపం హీరోయిన్ దగ్గర సమయానికి స్టాక్ ఉండదు. అలాగని ఆమె చేతులెత్తేయదు. బైక్ మీద హీరోను వెంటబెట్టుకుని తన బాస్ దగ్గరికెళ్తుంది. వయసు మళ్లిన ఆయన తనింట్లో శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతుండగా.. హీరోయిన్ గేటు బయటి నుంచి విషయం చెబితే బెడ్రూంలో ఉన్న ఆయన విసుక్కుంటూ బయటికొచ్చి కండోమ్ బాక్స్ ఇచ్చి పంపిస్తాడు. ఈ సీన్ చూశాక కూడా ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అవ్వకపోతే.. వాళ్ల సంగతేంటో తేల్చడానికి ఇంకో సీన్ వస్తుంది.

సిటీలో అందరూ గుట్కా తిని పాడైపోతున్నారని బాధ పడిపోయిన హీరోయిన్.. వాళ్లను మార్చడానికి ప్రయత్నించి ఫెయిలవుతుంది. ఇక ఒక దాదా గారి సాయం తీసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకడం కష్టమనుకుంటుంది. కానీ ఆ దాదా కూడా గుట్కా పిచ్చోడే. దీంతో అతను రివర్సులో ఎటాక్ చేస్తాడు. హీరోయిన్ సామాన్యురాలా? ఒక బంపర్ ప్లాన్‌ తో వస్తుంది. అతను ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేస్తుంది. అతను అసహనానికి గురవుతాడు. నేను ప్రేమిస్తే వద్దని వెళ్లిపోయిందంటాడు. అప్పుడు హీరోయిన్.. ఆమె నీకు ముద్దు పెడదామని వచ్చింది. కానీ నువ్వు గుట్కా తింటున్నావని ఆ వాసన భరించలేక వెళ్లిపోయిందంటుంది. అవునా.. అని అప్పటికప్పుడు ఆ దాదా గుట్కా ఊచేసి పళ్లు తోముకుని ఫ్రెష్ గా తయారైపోతాడు. అతడి ప్రేయసి వచ్చి లిప్ లాక్ ఇస్తుంది. దాన్ని ఒక సంబరం లాగా చూస్తూ నిల్చున్న హీరోయిన్ అండ్ బ్యాచ్ చప్పట్లు కొడుతుంది. తర్వాత దాదాగారు మొత్తం సిటీ అంతా గుట్కానే ఉండకూడదని ఉద్యమానికి దిగుతాడు. ఇది చూశాక కూడా ఫ్యూజులు ఎగిరిపోకుండా ఉంటే ఇంకా ఆణిముత్యాల్లాంటి ఇలాంటి ఎపిసోడ్లు మరిన్ని సినిమాలో ఎదురు చూస్తుంటాయి.

మేం కూడా ఒక సినిమా తీశాం. చేశాం అనిపించుకోవడానికి ఊరూ పేరు లేని దర్శక నిర్మాతలు.. నటీనటులు బి-గ్రేడ్ కంటెంట్ తో సినిమాలు తీయడం.. ఒకటో రెండో థియేటర్లలో రిలీజ్ చేసుకుని సంతృప్తి పొందడం మామూలే. ఏటా ఇలాంటి సినిమాలు పదుల సంఖ్యలో వస్తుంటాయి. పోతుంటాయి. కానీ సి.కళ్యాణ్ లాంటి పెద్ద నిర్మాత.. ‘ఆర్ఎక్స్ 100’తో మంచి పాపులారిటీ సంపాదించి ‘వెంకీ మామ’లో విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరో సరసన నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ లాంటి కథానాయిక ఉన్న సినిమా మరీ ఇంత అర్థరహితంగా.. బి-గ్రేడ్ సినిమాలా తయారై ఉంటుందని ఊహించలేం. కేవలం పాయల్ గ్లామర్ ఇమేజ్ ను వాడుకోవడానికి చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం ‘ఆర్డీఎక్స్ లవ్’. కాస్త గుర్తింపు ఉన్న కథానాయికని ఇంత చీప్ గా చూపించిన సినిమా ఈ మధ్య కాలంలో మరొకటి ఉండి ఉండదు. పైన చెప్పుకున్న కొన్ని ఎపిసోడ్లతోనే ఈ సినిమాపై ఒక అంచనాకు వచ్చేసి ఉంటారు కాబట్టి దీని కథాకథనాల గురించి లోతుగా చర్చించడం కూడా వృథానే. బోల్డ్ సినిమా అనే పేరుతో ఈ చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ఎక్స్ 100’ లాంటి సినిమాలతో పోలిస్తే వాటిని అవమానించినట్లే.

నటీనటులు:

పాయల్ రాజ్ పుత్ ఈ కథ విన్నపుడు ఏం ఊహించుకుందో ఏమో కానీ.. ఈ సినిమా పూర్తయ్యాక కూడా దీన్ని ఓన్ చేసుకుని ప్రమోట్ చేసినందుకు ఆమెను అభినందించాల్సిందే. ఓవైపు వెంకీ లాంటి హీరో పక్కన నటిస్తూ ఇలాంటి సినిమా చేయడం అంటే చేజేతులా కెరీర్ ను దెబ్బ తీసుకోవడమే. తన అందాల కోసం వచ్చే యువతను ఆమె అలరించింది కానీ.. ఇలాంటి సినిమా చేసి తన స్థాయిని బాగా తగ్గించుకుందన్నది మాత్రం వాస్తవం. ‘హుషారు’ సినిమాతో ఆకట్టుకున్న తేజస్.. ఇందులో ఒక వ్యర్థ పాత్ర చేశాడు. ఆదిత్య మీనన్ విలనీ బాగానే కామెడీ పండించింది. నాగినీడు.. తులసి.. ఆమని.. నరేష్ లాంటి వాళ్లు తమ స్థాయికి తగని పాత్రలు చేశారిందులో. హీరోయిన్ పక్కన కనిపించే అమ్మాయిలు ఇచ్చిన హావభావాలకు దండం పెట్టేయాల్సిందే.

సాంకేతికవర్గం:

‘అందాల రాక్షసి’.. ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాల్లో మతి పోగొట్టిన రధన్.. ‘ఆర్డీఎక్స్ 100’ సినిమాకు సంగీతాన్నందించాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. అతడి రిజెక్టెడ్ ట్యూన్స్ కూడా ఇంత బ్యాడ్ గా ఉంటాయా అనిపిస్తుంది. అతడి ముద్ర సంగీతంలో ఎక్కడా కనిపించదు. విలన్ పాత్రకు వాడిన సిగ్నేచర్ బీజీఎం ‘ఖైదీ నంబర్ 150’ ఒరిజినల్ ‘కత్తి’ నుంచి లేపేసింది. మరి రధన్ ఈ స్థాయికి ఎలా పడిపోయాడో? రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం గురించి చెప్పడానికేమీ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ నాసిరకంగా ఉన్నాయి. నది మధ్యలో బెడ్ వేసి తీసిన రొమాంటిక్ సాంగ్ లో మినహా ఎక్కడా నిర్మాణ విలువలు కనిపించలేదు. ఇక ‘ఎవరే అతగాడు’, ‘రాజు మహరాజు’ లాంటి ఫ్లాప్ సినిమాలు తీసిన భాను శంకర్ చౌదరి అలియాస్ శంకర్ భాను.. ‘ఆర్డీఎక్స్ లవ్’ సినిమాతో వాటి స్థాయిని పెంచాడు. దీంతో పోలిస్తే అవి క్లాసిక్స్ అనిపిస్తే ఆశ్చర్యం లేదు.

చివరగా: ఆర్డీఎక్స్ లవ్.. టార్చర్ అన్ లిమిటెడ్

రేటింగ్-0.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre