Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా 'RC15' - 'విజయ్66' అప్డేట్స్ ఇచ్చిన దిల్ రాజు..

By:  Tupaki Desk   |   24 Jan 2022 8:34 AM GMT
పాన్ ఇండియా RC15 - విజయ్66 అప్డేట్స్ ఇచ్చిన దిల్ రాజు..
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. #RC15 చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న మైలురాయి 50వ చిత్రం కావడంతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు ప్రస్తుతం తన ప్రొడక్షన్ లో రూపొందుతున్న సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. శంకర్ - చరణ్ కాంబోలో వస్తున్న RC15 చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రొడ్యూసర్ కంఫర్మ్ చేశారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత మేర‌కు పూర్త‌య్యింది. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు.

ఇకపోతే దిల్ రాజు బ్యానర్ ద్వారా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు గ్రహీత వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే మల్టీలాంగ్వేజ్ లలో రూపొందనున్న #thalapathy66 చిత్రాన్ని 2022 దీపావళి పండక్కి విడుదల ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి నుంచి విజయ్ 66వ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. దీపావళికి సినిమాను విడుదల చేయాలనేది మా ప్లానింగ్. వంశీ చెప్పిన స్క్రిప్ట్ విజయ్ కు విపరీతంగా నచ్చింది. 20 ఏళ్లలో తాను విన్న బెస్ట్ స్క్రిప్ట్ ఇదేనని విజయ్ అన్నారు. కరోనా సహకరించి, అన్నీ సవ్యంగా అనుకున్న ప్లానింగ్ ప్రకారం జరిగితే మా బ్యానర్ లో దీపావళికి విజయ్ సినిమా.. వచ్చే సంక్రాంతికి శంకర్-చరణ్ చిత్రాలు వస్తాయి'' అని పేర్కొన్నారు.

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. ఇప్పుడు ఈ రెండు పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ చేయనున్నారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు ఎలాంటి విజయాలు అందిస్తాయో చూడాలి.