Begin typing your search above and press return to search.

#RC15.. ఏడెక‌రాల్లో ప‌రుగులు పెట్టిస్తున్న శంక‌ర్

By:  Tupaki Desk   |   16 Nov 2021 5:23 AM GMT
#RC15.. ఏడెక‌రాల్లో ప‌రుగులు పెట్టిస్తున్న శంక‌ర్
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూణే లో కీల‌క‌ షెడ్యూల్ పూర్తిచేసారు. ఇందులో చ‌ర‌ణ్- కియారా అద్వానీ ఇత‌ర పాత్ర ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. తాజా షెడ్యూల్ ని హైద‌రాబాద్ లో పూర్తి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. అత్యంత కీల‌క‌ స‌న్నివేశాలను వేగంగా పూర్తి చేయాల‌ని సెవెన్ ఏక‌ర్స్ లో ప్ర‌త్యేకంగా సెట్లు నిర్మించి షూటింగ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ త‌ర్వాత చిత్రీక‌ర‌ణ కు తాత్క‌లికంగా కొన్నాళ్ల పాటు బ్రేక్ ప‌డుతుంద‌న్న‌ది ఇట‌వ‌లి స‌మాచారం.

డిసెంబ‌ర్ నుంచి శంక‌ర్ `భార‌తీయుడు-2` షూటింగ్ పునః ప్రారంభించాల్సిన నేప‌థ్యంలోనే చ‌ర‌ణ్ సినిమాని వాయిదా వేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన న్యాయ ప‌ర‌మైన ఇబ్బందుల్ని తొల‌గిస్తూ కోర్టు తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిబంధ‌న‌ల‌ ప్ర‌కారం డిసెంబ‌ర్ నుంచి షూట్ ప్రారంభించాల్సిన బాధ్య‌త శంక‌ర్ పై ఉంది. నిర్మాత సుభాస్క‌ర‌న్ తో ఆ విధంగా అగ్రిమెంట్ కూడా ఉండ‌టంతో చ‌ర‌ణ్ సినిమాని వాయిదా వేయ‌క త‌ప్ప‌లేద‌ని తెలుస్తోంది. అయితే డిసెంబ‌ర్ లో `భార‌తీయుడు-2` షూటింగ్ ప్రారంభ‌మైతే పూర్త‌వ్వ‌డానికి 4 నుంచి 6 నెల‌లు అయినా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

స‌హ‌జంగానే శంక‌ర్ సినిమాలు షూటింగ్ ఆల‌స్యంగా జ‌రుగుతుంటాయి. ఈ నేప‌థ్యంలో `భార‌త‌యుడు -2` షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుంద‌న్న‌ది ఖ‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితులు ఉన్నాయ‌న్న‌ది నిపుణుల మాట‌. మ‌రి ఈ సందిగ్ధ‌త‌పై క్లారిటీ రావాలంటే ద‌ర్శ‌క‌..నిర్మాత‌లు అధికారికంగా వెల్ల‌డిస్తే త‌ప్ప క్లారిటీ రాదు. ఒక‌వేళ ఎక్కువ గ్యాప్ గ‌నుక వ‌స్తే చ‌ర‌ణ్ కొత్త ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించే అవాకాశాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.