Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : రాయుడు

By:  Tupaki Desk   |   27 May 2016 11:50 AM GMT
మూవీ రివ్యూ : రాయుడు
X
చిత్రం: ‘రాయుడు’

నటీనటులు: విశాల్ - శ్రీదివ్య - రాధా రవి - సూరి - కులాపుల్లి లీల - ఆర్కే సురేష్ తదితరులు
సంగీతం: డి.ఇమాన్
ఛాయాగ్రహణం: వేల్ రాజ్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాత: బి.హరి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ముత్తయ్య

తెలుగులో తాను కోల్పోయిన మార్కెట్ ను తిరిగి సంపాదించుకోవడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు తెలుగువాడైన తమిళ కథానాయకుడు విశాల్. ఈసారి అతను ఊర మాస్ అవతారం ఎత్తి ‘రాయుడు’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రాయుడు (విశాల్) మార్కెట్లో మూటలు మోసే కూలీ. అతడికి తన నాయనమ్మ అంటే ప్రాణం. ఆమె ఏం చెబితే అది చేస్తాడు. ఆమె కోరిక మేరకే.. తనను అపార్థం చేసుకుని చెంపదెబ్బ కొట్టిన భాగ్యలక్ష్మి (శ్రీదివ్య)ను ప్రేమిస్తాడు కూడా. ఐతే భాగ్యలక్ష్మి తన తల్లిని చంపిన రౌడీ (ఆర్కే సురేష్)కి వ్యతిరేకంగా కోర్టులో రిట్ పిటిషన్ వేసి పోరాడుతూ ఉంటుంది. దీంతో అతడి మనుషులు ఆమెను చంపాలని చూస్తుంటారు. విశాల్ ఆ రౌడీల నుంచి ఆమెను కాపాడతాడు. అప్పుడే తన నాయనమ్మ ఆమెనే ప్రేమించి..పెళ్లి చేసుకోవాలని కోరడానికి కారణమేంటో కూడా తెలుస్తుంది రాయుడికి. ఇంతకీ ఆ కారణమేంటి? రాయుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడా? ఆ రౌడీ నుంచి కాపాడాడా? అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘రాయుడు’ సినిమాకు ఈ టైటిల్ కాకుండా.. ‘మంగమ్మ గారి మనవడు’ అని పేరు పెడితే బాగుండేదేమో. ఎందుకంటే ఇది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా. ఇందులోనూ ఓ అవ్వ.. ఓ మనవడు ఉంటారు. ఆ అవ్వంటే హీరోకు ప్రాణం. ఆమె ఏం చెప్పినా చేస్తాడు.. ఇక కథ చూసినా.. 80లు 90ల్లో వచ్చిన చాలా సినిమాలు గుర్తుకొస్తాయి. అప్పటి సినిమాల్లో లాగే బోలెడన్ని ఫైట్లు.. కావాల్సినంత సెంటిమెంటు.. కథలో ఏమాత్రం కొత్తదనం ఉండదు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసే అంశాలేమీ ఉండవు. మొత్తంగా ‘రాయుడు’ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే మామూలు మాస్ మసాలా సినిమా.

తమిళ సినిమాల్లో ఉండే గొప్పదనం ఏంటంటే.. వాటిలో సహజత్వం ఉట్టిపడుతుంది. నేటివిటీ కీలక పాత్ర పోషిస్తుంది. పాత్రలు అత్యంత సహజంగా ఉంటాయి. చాలా వరకు తమ చుట్టూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడి దర్శకులు కథలు అల్లుకుంటారు. పాత్రల్ని.. సన్నివేశాల్ని తీర్చిదిద్దుకుంటారు. ‘రాయుడు’ సినిమాలోనూ పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. ఇందులోని పాత్రలు కానీ.. సన్నివేశాలు కానీ కృత్రిమంగా అనిపించవు. సహజంగా ఉంటాయి. కాకపోతే సమస్య ఏంటంటే.. ఇది పూర్తిగా తమిళ నేటివిటీ ఉన్న సినిమా. ఎంత ఓన్ చేసుకుందామని చూసినా ఆ పాత్రలు.. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా తమిళ వాసన కొడుతుంటాయి. చాలా సన్నివేశాల్లో అరవ ‘అతి’ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని జీర్ణించుకోగలిగితే.. ‘రాయుడు’ అలా అలా టైంపాస్ చేయించేస్తాడు.

మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే యాక్షన్ దృశ్యాలు.. మాస్ కామెడీ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సెంటిమెంటు.. ‘రాయుడు’కి ప్రధాన ఆకర్షణ. కథగా చూస్తే కొత్తదనం ఏమీ ఉండదు. ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయొచ్చు. విశాల్ నుంచి మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలకు లోటుండదు. పాత్రకు తగ్గ ఆహార్యంతో విశాల్ ఆకట్టుకుంటాడు. తనదైన శైలిలో ఫైట్లు చేస్తూ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాడు. ఐతే సినిమాలో అతడి పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. సరైన క్యారెక్టరైజేషన్ లేదు. ఇది అసలు హీరో చుట్టూ తిరిగే కథ కాదు. మూడు లేడీ క్యారెక్టర్లే కథను నడిపిస్తాయి. ఆ మూడు పాత్రల్ని బాగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ‘రాయుడు’ కథలోని కొత్త పాయింట్ ఇదే. మాస్ సినిమాల్లో మామూలుగా లేడీ క్యారెక్టర్లని పెద్దగా వాడుకోవడం తక్కువ. కానీ ఇందులో వాటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్రలు ఆసక్తి రేకెత్తిస్తాయి.

ప్రథమార్ధమంతా ప్రధానంగా కామెడీ-రొమాన్స్ మీద దృష్టిపెట్టాడు దర్శకుడు. సూరి కామెడీ బాగానే టైంపాస్ చేయిస్తుంది. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కొంచెం బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే ఫైట్ బాగా తీశారు. హీరోయిన్ని ప్రేమించమని హీరో నాయనమ్మ చెప్పడం వెనుక ట్విస్టు ఆసక్తి రేపుతుంది. తన మనవణ్ణి విలన్ దగ్గరికి తీసుకెళ్లి నాయనమ్మ సవాల్ చేసే సీన్ బాగుంది. ప్రిక్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ బాగానే పండాయి. ఐతే ఇక్కడ తమిళ టచ్ ఎక్కువైపోయింది. ఇంత సెంటిమెంటును తెలుగు ప్రేక్షకులు భరించలేరు. చివర్లో హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులు లేకుండా మరీ మామూలుగా సాగిపోతుంది. విలన్ హీరో నాయనమ్మను చంపించడం.. ఇతను వెళ్లి అతణ్ని చంపడం.. ఇలా ఏ మలుపూ లేకుండా సినిమాను ముగించారు. సినిమా నిడివి మరీ రెండున్నర గంటలుండటం ఇబ్బందే.

నటీనటులు:

విశాల్ ఊర మాస్ పాత్రకు పర్ఫెక్టుగా సూటయ్యాడు. క్యారెక్టర్ కు తగ్గట్లుగా అతను తన బాడీని.. బాడీ లాంగ్వేజ్ ను మలుచుకున్న తీరు ప్రశంసనీయం. ఎప్పట్లాగే యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. సెంటిమెంట్ సీన్స్ లో అతడి నటన ఆకట్టుకుంటుంది. ఐతే అతడి పాత్రలో కొత్తదనం మాత్రం లేదు. శ్రీదివ్య కూడా సహజనమైన నటనతో ఆకట్టుకుంది. హీరో నాయనమ్మగా చేసినావిడ చాలా బాగా నటించింది. విలన్ పాత్రలో ఆర్కే సురేష్ కూడా రాణించాడు. సూరి పాత్ర పెద్ద రిలీఫ్. అతను బాగానే నవ్వించాడు.

సాంకేతికవర్గం:

టెక్నీషియన్స్ అందరూ సినిమాకు తగ్గ ఔట్ పుట్ ఇచ్చారు. డి.ఇమాన్ కథకు తగ్గట్లుగా ఊర మాస్ పాటలు అందించాడు. అందులో ఒంటి జెడ రోజా పాట ఆకట్టుకుంటుంది. పాటల్లో కూడా తమిళ వాసనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. వేల్ రాజ్ ఛాయాగ్రహణం కూడా సూటబుల్ గా ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరాతో చక్కగా ఎలివేట్ చేశాడు. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు ముత్తయ్యకు విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీల మీద బాగా అవగాహన ఉన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. మాస్ అంశాల్ని డీల్ చేయడంలో అతడి ప్రతిభ కనిపిస్తుంది. లేడీ క్యారెక్టర్లను బాగా తీర్చిదిద్దాడు. సెంటిమెంటు సన్నివేశాలు కూడా బాగా డీల్ చేశాడు. ఐతే కథలో మాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు. ఓవరాల్ గా అతడికి పాస్ మార్కులు పడతాయి.

చివరగా: రాయుడు.. మాస్.. అరవ మాస్

రేటింగ్- 2.5/5