Begin typing your search above and press return to search.

రామారావు బయ్యర్లకు రవితేజ సెటిల్ చేస్తారా..?

By:  Tupaki Desk   |   4 Sep 2022 4:21 AM GMT
రామారావు బయ్యర్లకు రవితేజ సెటిల్ చేస్తారా..?
X
ఇటీవల కాలంలో భారీ అంచనాల మధ్య విడుదలైన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. సినిమా మీదున్న హైప్ దృష్ట్యా అధిక రేట్లకు కొన్ని బయ్యర్లు అంతా తీవ్ర నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కొందరు నిర్మాతలు తమ వంతు బాధ్యతగా నష్టపోయిన వారికి సెటిల్ చేస్తున్నారు.

'ఆచార్య' డిజాస్టర్ అవ్వడంతో సినిమా బిజినెస్ వ్యవహారాలు చూసుకున్న దర్శకుడు కొరటాల శివ.. డిస్ట్రిబ్యూటర్స్ కు నష్ట పరిహారం చెల్లించాల్సి వచ్చిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలానే 'లైగర్' భారీ ప్లాప్ గా మిగలడంతో పూరీ జగన్నాథ్ సైతం బయ్యర్లకు సెటిల్ చేయనున్నాడని.. 30% తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు టాక్ నడుస్తోంది.

అయితే ఇప్పుడు ''రామారావు ఆన్ డ్యూటీ'' నష్టపరిహారం వ్యవహారం తెర మీదకు వచ్చింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. దీంతో కొనుగోలుదారులు భారీ నష్టాలు అందుకున్నారు. వీరంతా నష్టపరిహారం కోసం హీరో రవితేజ‌ను కలవడానికి రెడీ అవుతున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. పోస్టర్ మీద రవితేజ కు చెందిన RT టీమ్ వర్క్స్ బ్యానర్ పేరు కూడా వేశారు కాబట్టి.. హీరో కూడా నిర్మాణ భాగస్వామి అనుకోవాలి. మాస్ రాజా మూవీ కావడంతో మంచి రేట్లకే అమ్ముడైంది. కానీ దానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది.

దీంతో నిర్మాత సుధాకర్ నష్టపోయిన బయ్యర్లకు ఇప్పటికే తనవంతుగా కొంత మేర తిరిగి చెల్లించారట. ఇప్పుడు రవితేజ కూడా ఎంతో కొంత ఇస్తే నష్టాల నుంచి గట్టెక్కొచ్చని వారు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ వారంలో హీరోని కలిసి దీనిపై మాట్లాడాలని అనుకుంటున్నారట.

నిజానికి రవితేజ ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. పారితోషకం తీసుకోకుండా బదులుగా నిర్మాణంలో భాగస్వామిగా తన బ్యానర్ పేరు వేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. 'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా పడిన తర్వాత రీషూట్స్ కోసం రవితేజ అదనంగా డిమాండ్ చేశాడని రూమర్లు వచ్చాయి.

అడిగినంత ఇస్తే గానీ డబ్బింగ్ చెప్పడానికి రానని చెప్పేసాడని.. సినిమా విడుదల ఆలస్యం అవడానికి ఇది కూడా ఒక కారణమని రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే దీనిపై రవితేజ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ''పోస్టర్ పై RT టీమ్ వర్క్స్ అని నా బ్యానర్ పేరు కనిపిస్తోంది. నేనే నిర్మాతగా సినిమా చేస్తున్నప్పుడు ఇంక రెమ్యునరేషన్ ప్రాబ్లమ్ ఏంటి?'' అని ప్రశ్నించారు. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు అందరూ తన దృష్టిలో పనీపాట లేని బ్యాచ్ అని అన్నారు.

రవితేజ చెప్పిన దాన్ని బట్టి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాకు ఆయన కూడా ఒక నిర్మాత అనే విషయం స్పష్టమయింది. అందుకే ఇప్పుడు నష్టపోయిన బయ్యర్లు రవితేజ‌ను కలవాలని అనుకుంటున్నారట. ఇదే నిజమైతే మాస్ మహారాజా తన సినిమా వల్ల నష్టపోయిన వారిని ఆడుకోడానికి ముందుకు వస్తారో లేదో చూడాలి.