Begin typing your search above and press return to search.

'బింబిసార'ను రిజెక్ట్ చేసిన ర‌వితేజ‌.. అస‌లు నిజం ఇది!

By:  Tupaki Desk   |   28 July 2022 11:30 PM GMT
బింబిసారను రిజెక్ట్ చేసిన ర‌వితేజ‌.. అస‌లు నిజం ఇది!
X
నందమూరి కళ్యాణ్ రామ్ త్వ‌ర‌లోనే 'బింబిసార‌' అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో దాదాపు న‌లబై కోట్ల బడ్జెట్ తో నిర్మిత‌మైన ఈ సోషియో ఫాంటసీ సినిమా ద్వారా ప్ర‌ముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి త‌న‌యుడు మల్లిడి వశిష్ట్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వారినా హుసేన్ హీరోయిన్లుగా న‌టించారు. ఇదో టైమ్‌ ట్రావెల్‌ మూవీ. ఇందులో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడిగా క‌ళ్యాణ్ రామ్ క‌నిపించ‌బోతున్నాడు. ఆగ‌స్టు 5న ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల కాబోతోంది.

ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన గ్లింప్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్లు అదిరిపోయే రెస్పాన్స్ ను ద‌క్కించుకుని ప్రేక్ష‌కుల్లో సినిమాపై మంచి బ‌జ్ ను క్రియేట్ చేయ‌గా.. మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మ‌రింత హైప్ సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజుల నుండీ ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. బింబిసార‌ క‌థ క‌ళ్యాణ్ రామ్ కంటే ముందే మాస్ మ‌హారాజ్ ర‌వితేజ వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌.

ఆయ‌న‌కు క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో రిజెక్ట్ చేశాడ‌ని, ఆపై క‌ళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ ను టేక‌ప్ చేశాడ‌న్న‌దే ఆ వార్త సారాంశం. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఆ వార్త‌లో ఎటువంటి నిజం లేద‌ట‌. రీసెంట్ గా డైరెక్ట‌ర్ వశిష్ట్ రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమాకు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు.

''క‌ళ్యాణ్ రామ్ గారిని ఊహించుకునే 'బింబిసార‌'ను రెడీ చేశాను. నా ద‌గ్గ‌ర మొద‌ట చిన్న ఐడియా ఉండేది. దాన్ని క‌ళ్యాణ్ రామ్ గారితో షేర్ చేసుకోగా.. ఆయ‌న‌ వెంట‌నే సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. అప్పుడు పూర్తి క‌థ, స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ఒక‌వేళ క‌ళ్యాణ్ రామ్ గారు నో చెప్పుంటే.. అసలు 'బింబిసార‌' ఉండేదే కాదు'' అంటూ డైరెక్ట‌ర్ వ‌శిష్ట్ వివ‌రించారు.

ఈయ‌న మాట‌ల బ‌ట్టీ చూస్తుంటే.. ర‌వితేజ వ‌ద్ద‌కు 'బింబిసార' క‌థ వెళ్ల‌డం, ఆయ‌న తిర‌స్క‌రించ‌డం అనేవి అవాస్త‌వం అని తేలిపోయింది. క‌ళ్యాణ్ రామ్ కోస‌మే వ‌శిష్ట్ 'బింబిసార‌' క‌థ‌ను రాసిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది. మ‌రి ఈ మూవీతో క‌ళ్యాణ్ రామ్ కు భారీ హిట్ ఇచ్చి తొలి ప్ర‌య‌త్నంలోనే వ‌శిష్ట్ స‌క్సెస్ అవుతాడా..? లేదా..? అన్న‌ది చూడాలి.