Begin typing your search above and press return to search.

మాస్ రాజాతో అయినా అదృష్టం కలిసివస్తుందేమో..!

By:  Tupaki Desk   |   8 May 2020 1:30 PM GMT
మాస్ రాజాతో అయినా అదృష్టం కలిసివస్తుందేమో..!
X
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పాపులర్ సినీ రచయితలలో ఒకరు వక్కంతం వంశీ. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి రచయితగా మారి ఇప్పుడు దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అల్లు అర్జున్ తో తెరకెక్కించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఆయనకు దర్శకుడిగా మొదటి సినిమా. ఆ సినిమా జయాపజయాల గురించి పక్కన పెడితే ఈయనకు దర్శకుడిగా మంచి పేరునే తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం దర్శకుడిగా రెండో సినిమా రూపొందించడానికి సన్నద్ధం అవుతున్నారు. మొదటి సినిమా విఫలం అవ్వడంతో రెండో సినిమాను చాలా శ్రద్ధ పెట్టి రాస్తున్నారట. అయితే ఇటీవలే మాస్ రాజా రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపిస్తే.. రవితేజ బాగుందని చెప్పి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయుమని చెప్పాడట. ఇక అప్పటి నుండి స్క్రిప్ట్ పనిలో మునిగి తేలుతున్నాడట. ఇక ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్లతో పనిచేసిన వంశీ.. తన కెరీర్లో చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ సినిమాలకు కథలు అందించారు.

అయితే మాస్ రాజా రవితేజతో పనిచేయడం వంశీకి కొత్తేమి కాదు. ఎందుకంటే ఇదివరకే రవితేజ-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన కిక్, కిక్2 సినిమాలకు కథలు అందించి స్టార్ రైటర్ గా మారిపోయారు. కానీ దర్శకుడిగా రవితేజతో పనిచేయడం వంశీకి మొదటిసారి. అయితే వంశీ రాసిన కిక్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా రవితేజ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా రికార్డు సృష్టించింది. అనంతరం ఆ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా కిక్ పేరుతో రూపొంది వందల కోట్లు వసూల్ చేసింది. అయితే ప్రస్తుతం వంశీ రాస్తున్న స్క్రిప్ట్ రవితేజ కెరీర్లో టాప్ గా నిలవనుందని టాక్. వంశీ ఎంత మంచి రైటరో అందరికి తెలిసిందే. ఇక రవితేజతో అయినా బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీళ్ళ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో ఇంకా తెలియాల్సి ఉంది.