Begin typing your search above and press return to search.

రవితేజ కొత్త సినిమా కొత్త పుకారు

By:  Tupaki Desk   |   10 July 2021 4:11 AM GMT
రవితేజ కొత్త సినిమా కొత్త పుకారు
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇటీవలే షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్‌ లో ఈ సినిమా షూటింగ్‌ ను నిర్వహిస్తున్నారు. శరత్‌ మండవ చెప్పిన కథ బాగా నచ్చడంతో అంతకు ముందు కమిట్ అయిన సినిమాలను కూడా పక్కకు పెట్టి రవితేజ వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ఒప్పుకున్నాడు అంటే కథ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శరత్‌ మండవ కొత్త దర్శకుడు అయినా కూడా తప్పకుండా కథకు న్యాయం చేసే విధంగా తెరకెక్కిస్తాడని యూనిట్‌ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రవితేజ ను ఈ సినిమాలో దర్శకుడు శరత్‌ మండవ ఒక మండల రెవిన్యూ ఆఫీసర్‌ గా అంటే ఎమ్మార్వో గా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ టాక్‌ వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్‌ ను చూస్తే ఆ విషయం నిజమే అనిపించింది. ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్నట్లుగా ప్రీ లుక్‌ ను డిజైన్‌ చేసి విడుదల చేశారు. దాంతో అంతా కూడా ఎమ్మార్వో కు ఫిక్స్ అయ్యి ఉండగా తాజాగా కొత్త పుకారు ఒకటి షికారు చేస్తోంది. రవితేజ చేస్తున్న పాత్ర ఎమ్మార్వో ది కాదని.. జాయింట్‌ కలెక్టర్ గా రవితేజ ఈ సినిమా లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

తన చుట్టు ఉన్న అవినీతి అధికారులతో పాటు.. ప్రభుత్వ అధికారులను బెదిరించి పనులు చేయించుకునే విలన్స్‌ ను ఎదిరించే జాయింట్‌ కలెక్టర్‌ గా రవితేజ కనిపిస్తాడని చెబుతున్నారు. తన కింది అధికారులను మాత్రమే కాకుండా పై అధికారులపై కూడా ప్రతాపం చూపించే నిజాయితీ పరుడైన పాత్రలో రవితేజ కనిపించబతున్నాడని తాజా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మార్వో అంటూ ప్రచారం జరిగింది.. ఇప్పుడు జాయింట్‌ కలెక్టర్‌ అంటున్నారు. తర్వాత కలక్టర్ అంటారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది చెప్పాలని అభిమానులు రవితేజను మరియు దర్శకుడు శరత్‌ మండవను కోరుతున్నారు.

చైతూ సినిమాలో నటించి మెప్పించిన దివ్యాంశ కౌశిక్‌ కు ఈ సినిమాలో హీరోయిన్‌ గా అవకాశం దక్కింది. కేవలం మూడు నాలుగు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను 1990 బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కిస్తున్నారట. ఆ సమయంలో ఉన్న ప్రభుత్వ పరిపాలన మరియు ఆ సమయంలో జరిగిన అవినీతి అనేది ఈ సినిమాలో చక్కగా కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో చూపించేందుకు గాను దర్శకుడు స్క్రిప్ట్‌ సిద్దం చేసుకున్నాడు.

రవితేజ ఇప్పటికే ఖిలాడీ సినిమాను పూర్తి చేశాడు. థియేట్లు ఎప్పుడు ఓపెన్‌ అయితే అప్పుడు ఖిలాడీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది క్రాక్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఖిలాడీతో కూడా సక్సెస్‌ అవుతాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఇప్పటికే క్యూ కట్టాయి. కనుక కాస్త అటు ఇటుగా అంటే జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో అయినా ఈ సినిమాను విడుదల చేస్తారట. క్రాక్‌ సినిమా ను సంక్రాంతికి వారం ముందు విడుదల చేసి సక్సెస్‌ దక్కించుకున్నాడు. అందుకే ఈ సినిమా ను కూడా సంక్రాంతికి కాస్త ముందు విడుదల చేసినా ఆశ్చర్యం లేదు. ఎప్పుడు వచ్చినా ఒక మంచి సినిమా అవుతుందని మాత్రం రవితేజ సన్నిహితులు నమ్మకంగా చెబుతున్నారు.