Begin typing your search above and press return to search.

మాస్ రాజా.. ఇప్పుడేమంటాడో?

By:  Tupaki Desk   |   28 May 2018 11:00 PM IST
మాస్ రాజా.. ఇప్పుడేమంటాడో?
X
రవితేజకు మాస్ రాజా అని పేరెందుకు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నప్పటి నుంచి అతను ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే చేస్తున్నాడు. వాటితోనే పెద్ద విజయాలందుకున్నాడు. మధ్య మధ్యలో కొన్ని భిన్నమైన.. క్లాస్ టచ్ ఉన్న సినిమాలు చేస్తే అవి తేడా కొట్టేశాయి. దీంతో ప్రేక్షకుల అభిరుచి మారుతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఒక ఆలోచనకు ఫిక్సయిపోయి మాస్ మాస్ అంటూ సాగిపోతున్నాడు. మీరెందుకు మాస్ సినిమాలే చేస్తున్నారు అని రవితేజను అడిగితే చాలు.. తాను కొంచెం డిఫరెంటుగా ట్రై చేసి ఫెయిల్యూర్లు ఎదుర్కొన్న ‘నా ఆటోగ్రాఫ్’.. ‘శంభో శివ శంభో’.. ‘సారొచ్చారు’ లాంటి సినిమాల లిస్టు తీస్తాడు మాస్ రాజా. కేవలం డిఫరెంటుగా ట్రై చేయడం వల్లే ఆ సినిమాలు పోయాయా అన్నది ప్రశ్న.

కొత్తగా ట్రై చేసినంత మాత్రాన అన్నీ ఆడాలని లేదు. కొత్తదనం ఉండాలి. అదే సమయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలి. అలా కానపుడు సినిమా పోవచ్చు. మరి రవితేజ మాస్ సినిమా ట్రై చేసిన ప్రతిసారీ విజయాన్నందుకుంటున్నాడా? అతడి కెరీర్లో ఎన్ని డిజాస్టర్లు లేవు. మాస్ మాస్ అంటూ చేసిన ‘టచ్ చేసి చూడు’.. ‘నేల టిక్కెట్టు’ ఏమయ్యాయి? రవితేజ కొత్తగా ట్రై చేసిన సినిమాలేవీ కూడా ఈ స్థాయిలో పరాజయాన్ని పొందలేదు. ఇంతకుముందు రామ్ చరణ్ సైతం మాస్ మాస్ అంటూ ఊగిపోయాడు. కానీ ‘బ్రూస్ లీ’తో దారుణమైన దెబ్బ తిన్నాక కానీ అతడి ఆలోచన మారలేదు. తర్వాత ‘ధృవ’.. ‘రంగస్థలం’ లాంటి విభిన్నమైన సినిమాలు చేసి గొప్ప విజయాలు అందుకున్నాడు. రవితేజ కంటే పెద్ద పెద్ద స్టార్లు కూడా మాస్ మంత్రం వదిలేసి డిఫరెంట్ సినిమాల వైపు అడుగులేస్తుంటే అతను మాత్రం మారట్లేదు. ఫలితాలూ మారట్లేదు. ఇప్పటికైనా అతను మార్పు చూపించకపోతే మాత్రం పూర్తిగా ఫాలోయింగ్.. మార్కెట్ కోల్పోయి ఇండస్ట్రీలో అతడి ఉనికే ప్రశ్నార్థకం అయిపోవడం ఖాయం.