Begin typing your search above and press return to search.

రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' లో 'చిరునవ్వుతో' హీరో..!

By:  Tupaki Desk   |   29 July 2021 7:04 AM GMT
రవితేజ రామారావు ఆన్ డ్యూటీ లో చిరునవ్వుతో హీరో..!
X
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రామారావు ఆన్ డ్యూటీ''. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ ప్రారంభ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇచ్చినప్పటి నుంచే దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. మాస్ ని ఆకట్టుకునే టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్లకు అభిమానులు మరియు సినిమా సర్కిల్స్ నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం మరో సర్ప్రైజింగ్ అనౌన్సమెంట్ తో వచ్చింది.

గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి ''రామారావు ఆన్ డ్యూటీ'' చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 1999లో 'స్వ‌యంవ‌రం' సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వేణు.. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో కొన్నేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న వేణు.. 'చిరున‌వ్వుతో' 'హ‌నుమాన్ జంక్ష‌న్‌' 'క‌ళ్యాణ రాముడు' 'పెళ్లాం ఊరెళితే' 'ఖుషీ ఖుషీగా' వంటి సుమారు 26 సినిమాల్లో హీరోగా న‌టించారు.

2009లో 'గోపి గోపిక గోదావ‌రి' సినిమా త‌ర్వాత బ్రేక్ తీసుకుని.. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దమ్ము' చిత్రంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ గా నటించాడు వేణు తొట్టెంపూడి. ఆ త‌ర్వాత హీరోగా 'రామాచారి' అనే సినిమా చేసినా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో వ్యాపార కార్య‌క‌లాపాలపై దృష్టి పెట్టి సినిమాల‌కు దూరం అయ్యాడు. ఈ క్రమంలో ఇన్నాళ్లకు రవితేజ ''రామారావు ఆన్ డ్యూటీ'' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వేణు ఈ చిత్రంలో ఇంతకముందు ఎప్పుడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇకపోతే 'రామారావు ఆన్ డ్యూటీ' లో రవితేజ సరసన ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్లు రజిషా విజయన్ - దివ్యాన్ష కౌశిక్ నటించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రెడీ చేసిన కథతో ఒక స్పెషల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - రాహుల్ రామకృష్ణ - 'ఈరోజుల్లో' శ్రీ - సురేఖ వాణి - మధు సూధన్ రావు - చైతన్య కృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

RT టీమ్‌ వర్క్స్ తో కలిసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 'క్రాక్' హిట్ తో జోష్ మీదున్న మాస్ మహారాజాకు ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.