Begin typing your search above and press return to search.

గోవా కి పయనమైన మాస్ మహారాజ్..!

By:  Tupaki Desk   |   3 Dec 2020 2:15 PM IST
గోవా కి పయనమైన మాస్ మహారాజ్..!
X
మాస్‌ మహారాజ్‌ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ "క్రాక్‌". గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌ పై బి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజకు జోడీగా శ్రుతి హాసన్‌ నటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు గుంటూరు పరిసర ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. దీంట్లో రవితేజ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'క్రాక్' ఫస్ట్ లుక్ మరియు టీజర్ లకు విశేష స్పందన వచ్చింది. కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలతో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఫైనల్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ గోవాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా రవితేజ 'క్రాక్' షూటింగ్ గోవా లో జరగబోతున్న విషయాన్ని వెల్లడించాడు. 'క్రాక్' ఫైనల్ షెడ్యూల్ కోసం గోవా కు వెళ్తున్నాని ట్వీట్ చేస్తూ ఫ్లైట్ లో ఉన్న ఓ ఫోటోని షేర్ చేశాడు. ఇందులో మాస్ మహారాజ్ గాగుల్స్ మరియు మాస్క్ ధరించి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత మూవీ సాంగ్స్ మరియు ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్లను ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ - సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ‘డాన్‌ శీను’ ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్‌ మలినేని - రవితేజ కాంబినేషన్‌ లో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 'క్రాక్' చిత్రానికి వచ్చే సంక్రాంతికి థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.