Begin typing your search above and press return to search.

రవితేజ హీరో మాత్రమే కాదు .. ఒక యూనివర్సిటీ!

By:  Tupaki Desk   |   10 Feb 2022 2:48 AM GMT
రవితేజ హీరో మాత్రమే కాదు .. ఒక యూనివర్సిటీ!
X
టాలీవుడ్లో రచయితగా .. దర్శకుడిగా నిరూపించుకున్న అతి తక్కువ మందిలో బాబీ ఒకరు. గతంలో రవితేజ హీరోగా చేసిన 'డాన్ శీను' సినిమాకి ఆయన స్క్రీన్ ప్లేను అందించారు. ఆ తరువాత 'బలుపు' సినిమాకి కథను అందించారు. ఒక దర్శకుడిగా ఆయన రవితేజకి 'పవర్' సినిమాతో హిట్ ఇచ్చారు. అందువలన ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. 'ఖిలాడి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఆయన, 'బలుపు' సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ను స్టేజ్ మీద చెప్పారు.

"బాస్ అంటే బస్ పాస్ కాదు బే .. ఎవడుపడితే వాడు వాడేసుకోవడానికి. అది మన బలుపును బట్టి .. బాడీ లాంగ్వేజ్ ను బట్టి జనం ఇచ్చే బిరుదు" అనే డైలాగ్ చెప్పగానే ఆడిటోరియంలో ఈలలు .. గోలలు. ఆ తరువాత బాబీ మాట్లాడుతూ .. "మాస్ మహారాజ్ .. ఈ నెలలో ఆయనను కలవడానికి ఒక నాలుగు సార్లు వెళ్లాను. ఒక్కోసారి ఒక్కో లొకేషన్లో .. ఒక్కో డైరెక్టర్ తో .. ఒక్కో నిర్మాతతో ఆయన షూటింగులో ఉన్నారు. అలా వరుస సినిమాలతో ఆయన కిక్ ఇస్తున్నారు. రెండు యూనివర్శిటీలు కలిసి ఈ సినిమాను రెడీ చేస్తున్నాయి.

ఒక యూనివర్శిటీ రవితేజ గారు అయితే .. మరో యూనివర్సిటీ కోనేరు సత్యయనారాయణ గారు. రవితేజగారు మాలాంటి ఎంతోమంది దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. మాస్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఫీజు కట్టించుకోకుండా అడ్మిషన్ల మీద అడ్మిషన్లి ఇస్తున్నారు .. నెక్స్ట్ లెవెల్ కి పంపిస్తున్న ఆయనకి అందరి తరఫున థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే కోనేరు సత్యనారాయణగారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. నన్ను ఆయన ఒక కుటుంబ సభ్యుడి మాదిరిగా చూస్తుంటారు.

కోనేరు సత్యనారాయణగారు చాలా స్ట్రిక్ట్. అలాంటిది రమేశ్ వర్మ గారు 90 రోజులలో చేస్తానని చెప్పి 130 రోజులు షూటింగు చేశాడంటే, ఆయన సత్యనారాయణగారికి ఏం చెప్పి ఉంటాడా .. ఎలా నమ్మించాడా అని నాకు ఆశ్చర్యం వేస్తోంది.

వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నట్టుగా, ఎన్ని అబద్ధాలు ఆడేసి ఇంత బడ్జెట్ పెట్టించాడని నేను అనుకుంటున్నాను. ఇక రవితేజ కొత్త దర్శకులకు మాత్రమే కాదు, కొత్త హీరోయిన్స్ కి కూడా ఛాన్స్ ఇస్తారనేది ఈ సినిమాతో కూడా నిరూపించారు. ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలను నేను ఎక్కువగా వింటూ ఉంటాను. మొన్న ఒక రోజున ఉదయం 9 గంటలకు నా కార్లో ఆయన పాటలు పెడితే 4 గంటల వరకూ ఆయన హిట్ సాంగ్స్ వస్తూనే ఉన్నాయి .. అన్ని హిట్లు ఇచ్చిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఈ సినిమాకి ఆయన అందించిన పాటలు కూడా బాగా పాప్యులర్ అయ్యాయి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అంటూ ముగించాడు.