Begin typing your search above and press return to search.

తమిళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో మాస్ మహారాజా..?

By:  Tupaki Desk   |   13 Jan 2022 10:06 AM IST
తమిళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో మాస్ మహారాజా..?
X
విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన తమిళ సినిమా ''మానాడు'' ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. టైం లూప్ కాన్సెప్ట్ తో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో శింబు - ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ మూవీ విశేష స్పందన తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో తెలుగు డబ్బింగ్ రైట్స్ తో పాటు.. అన్ని భాషల రీమేక్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో తెలుగు రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం 'మానాడు' రీమేక్ లో మాస్ మహారాజా రవితేజ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా గురించి రవితేజతో చర్చించారట. బేసిక్ కాన్సెప్ట్‌ ను లైక్ చేసిన మాస్ రాజా.. ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. తెలుగు సెన్సిబిలిటీస్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసిన ఫైనల్ నెరేషన్ వినడానికి రవితేజ వేచి చూస్తున్నారట. పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులో నటించాలా వద్దా అనేది హీరో డిసైడ్ అవుతారేమో చూడాలి.

వాస్తవానికి 'మానాడు' చిత్రాన్ని ''రివైండ్'' పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ మూవీ టీజర్ ని గతేడాది ఫిబ్రవరిలో రవితేజ లాంచ్ చేశారు. ఆ తర్వాత ''ది లూప్'' అనే టైటిల్ తో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కేవలం తమిళంలోనే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.

ఇప్పుడు 'మానాడు' రీమేక్ లో రవితేజ నటించనున్నారని టాక్ వస్తోంది. మరి తెలుగులో వెంకట్ ప్రభు డైరెక్షన్ చేస్తారా లేదా సురేష్ బాబు మరో దర్శకుడి చేతిలో పెడతారా అనేది చూడాలి. ప్రస్తుతం స్టార్ హీరో ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'ఖిలాడీ' షూటింగ్ పూర్తవ్వగా.. 'రామారావు ఆన్ డ్యూటీ' 'రావణాసుర' 'టైగర్ నాగేశ్వరరావు' మరియు 'ధమాకా' చిత్రాల్లో నటిస్తున్నారు.