Begin typing your search above and press return to search.

ర‌వితేజ‌పై సిట్ అధికారుల ప్ర‌శ్న‌ల వ‌ర్షం!

By:  Tupaki Desk   |   28 July 2017 5:28 PM GMT
ర‌వితేజ‌పై సిట్ అధికారుల ప్ర‌శ్న‌ల వ‌ర్షం!
X
టాలీవుడ్‌ లో ప్ర‌కంప‌న‌లు రేపిన డ్రగ్స్ రాకెట్ లో నోటీసులు అందుకున్న సినీ ప్ర‌ముఖుల విచార‌ణ కొన‌సాగుతోంది. రోజుకొక‌రు చొప్పున సిట్ కార్యాల‌యానికి హాజర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 19న పూరీ జ‌గ‌న్నాథ్ తో సిట్ విచార‌ణ ప్రారంభ‌మైంది. ఈ వ్య‌వహారంలో మొద‌టి నుంచి పూరీ జ‌గ‌న్నాథ్ తో పాటు హీరో ర‌వితేజ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నసంగ‌తి తెలిసిందే. వారిద్ద‌రికీ ఇండ‌స్ట్రీలో స‌న్నిహిత సంబంధాలుండ‌డం, రవితేజ సోద‌రులు గ‌తంలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో అరెస్టు కావడంతో ర‌వితేజ విచార‌ణ‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభ‌మైన ర‌వితేజ విచారణ కొద్ది సేప‌టి క్రితం ముగిసింది. సుమారు తొమ్మిది గంటలపాటు రవితేజను సిట్ అధికారులు విచారించారు. సిట్ అధికారుల ప్ర‌శ్న‌ల‌కు ర‌వితేజ ఉక్కిరిబిక్కిరి అయిన‌ట్లు కొన్ని చానెళ్ల‌లో వార్తలు వ‌చ్చాయి.

రవితేజకు సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిన‌ట్లు తెలుస్తోంది. ర‌వితేజ సోద‌రులు డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న గురించి కూడా సిట్ అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి. కెల్విన్‌ - జీశాన్‌ తో సంబంధాలపై ఆయనను అధికారులు ప్రశ్నించిన‌ట్లు తెలిసింది. అయితే, కెల్విన్ తో త‌న‌కు ప‌రిచ‌యం ఉంద‌ని ర‌వితేజ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈవెంట్ల సంద‌ర్భంగా కెల్విన్ ప‌రిచ‌య‌మ‌ని - జీశాన్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని ర‌వితేజ తెలిపిన‌ట్లు స‌మాచారం. త‌న‌కు అస‌లు డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు లేద‌ని, ప‌బ్ ల‌కు కూడా తాను పెద్ద‌గా వెళ్ల‌న‌ని ర‌వితేజ తెలిపిన‌ట్లు స‌మాచారం. షూటింగ్ స‌మ‌యాల్లో డైరెక్టర్ ఎక్కడ షూటింగ్‌ ప్లాన్ చేస్తే అక్కడికి వెళ్తాన‌ని, అక్కడున్న గెస్ట్‌ హౌస్‌ లో బస చేస్తామ‌ని ర‌వితేజ చెప్పిన‌ట్లు తెలిసింది.

పూరీ జగన్నాథ్ వ‌ల్లే ఇండ‌స్ట్రీలో అంద‌రూ ప‌రిచయం కాలేద‌ని , ముమైత్ , ఛార్మితో పాటు అనేక మంది మిత్రులు ఇండ‌స్ట్రీలో ఉన్నార‌ని ర‌వితేజ చెప్పిన‌ట్లు తెలిసింది. బ్యాంకాక్ వెళ్ల‌న‌పుడు యూనిట్ స‌భ్యుల‌తో స‌ర‌దాగా చిన్న చిన్న పార్టీలు చేసుకుంటామ‌ని ర‌వితేజ చెప్పార‌ని స‌మాచారం. రక్తం - వెంట్రుకలు - కాలి - చేతి గోళ్లను పరీక్షల కోసం అడగగా రవితేజ నిరాకరించినట్టు తెలుస్తోంది. విచారణ స‌మ‌యంలో రవితేజ లంచ్ చేయలేదు. అధికారులు ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ తిన్న‌ట్లు తెలిసింది. ఉదయం నవ్వుతూ సిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజ...వెళ్లిపోయే సమయంలో కాస్త ముభావంగా కనిపించాడు. విచారణ ముగిసిన అనంతరం రవితేజ మీడియాకు చేతులు జోడిస్తూ మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. వేగంగా నడిచి వెళ్తూ కారెక్కాడు. రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజును విచారించ‌నున్న‌ట్లు సిట్ అధికారులు తెలిపారు.