Begin typing your search above and press return to search.

సిట్‌ కు రివ‌ర్స్ ప్ర‌శ్న‌లు వేసిన ర‌వితేజ‌

By:  Tupaki Desk   |   29 July 2017 5:09 AM GMT
సిట్‌ కు రివ‌ర్స్ ప్ర‌శ్న‌లు వేసిన ర‌వితేజ‌
X
డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన నటుడు రవితేజను సిట్ అధికారులు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. డ్రగ్స్ వాడకం - అమ్మకం - డ్రగ్స్‌మాఫియాతో సంబంధాలపై ప్రశ్నలు సంధిస్తూనే.. ఏడాదిలో మూడిళ్ళు ఎలా కొన్నారంటూ సిట్ అధికారులు ప్రశ్నించడంతో రవితేజ కోపగించుకున్నట్టు తెలిసింది. కేసు ఒకటైతే..అడిగేది మరొకటి..ఇది పద్ధతి కాదంటూ రవితేజ సిట్ అధికారులకు దీటుగా జవాబు ఇచ్చినట్టు సమాచారం.

డ్ర‌గ్స్ కేసు విచారణలో భాగంగానే ఏడాదిలో మూడిళ్లు ఎలా కొన్నారని, డ్రగ్స్ వ్యాపారంలో మీ పాత్ర ఏమైనా ఉందా? అని సిట్ అధికారులు సమర్థించుకున్నట్టు సమాచారం. దీంతో నటుడు రవితేజ - సిట్ అధికారుల మధ్య పరస్పర విరుద్ధ అభిప్రాయాలు చోటుచేసుకున్నట్టు తెలిసింది. ``డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? ఎవరెవరితో తీసుకుంటున్నారు? జాక్ ఈవెంట్లలో ఎపుడెప్పుడు పాల్గొన్నారు? అక్కడ డ్రగ్స్ సరఫరా చేసేవారా?`` అని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో రవితేజ ఉద్రేకానికి లోనై డ్రగ్స్ అలవాటే లేనప్పుడు, ఇతరుల గురించి అడగడం దేనికి? అంటూ సిట్ అధికారులను ప్రశ్నించారు. జీషాన్ ఎవరో తెలియదు..కెల్విన్ మాత్రం ఈవెంట్లలలో కలిసేవారని రవితేజ సిట్ అధికారుల ముందు అంగీకరించినట్టు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంపైనే సాగిన విచారణలో మూడిళ్ల కొనుగోలుపై రవితేజ స్పష్టత ఇవ్వడం కానీ..సిట్ అధికారులు ఇళ్ళ ప్రస్తావన మళ్లీ తేవడం కానీ జరగకపోవడం గమనార్హం. మొత్తంపైన శుక్రవారం జరిగిన సిట్ విచారణలో అధికారుల ప్రశ్నలకు నటుడు రవితేజ దీటుగానే సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

కాగా, డ్రగ్స్ సూత్రధారులు కెల్విన్, జాక్‌లతో హీరో రవితేజకు ఉన్న సంబంధాలపైనే సిట్ దృష్టి కేంద్రీకరించింది. పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించిన సిట్, ఆశించిన స్థాయి సమాచారాన్ని సేకరించలేకపోయినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వాడకంపై భిన్న కోణాల్లో విచారించిన సిట్ అధికారులకు డ్రగ్స్ మాఫియా కెల్విన్ - జాక్‌ లతో రవితేజకు గల సంబంధాలపై క్లారిటీ వచ్చినట్టు సమాచారం. జీషాన్‌ తో రవితేజకు కెల్విన్ పరిచయమైనట్టు, ఈవెంట్స్‌లోనే లావాదేవీలు జరిగినట్టు సిట్ భావిస్తోంది. అయితే కేసులో రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజు కీలకమైనందున, అతడిని శనివారం విచారిస్తున్నారు. కెల్విన్ - జీషాన్‌ లతో సంబంధాలపై తొలుత తనకెవరూ తెలీదని చెప్పిన రవితేజ - సిట్ దగ్గరున్న ఫొటోలు - ఫోన్ సంభాషణలు వినిపించడంతో కెల్విన్ మాత్రమే తెలుసని అంగీకరించినట్టు స‌మాచారం.