Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ లో తొలి హిట్ రవితేజ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   14 Dec 2020 1:00 PM IST
న్యూ ఇయర్ లో తొలి హిట్ రవితేజ ఇస్తాడా?
X
రవితేజ తెలుగు తెరపైకి రావడమే ఒక ఉప్పెనలా వచ్చాడు. తన ఎనర్జీతో కథలను కదనుతొక్కించాడు .. పాత్రలను పరిగెత్తించాడు. ఊపు .. ఉత్సాహం ఆయన డైలాగ్స్ లో వినిపించడమే కాదు .. ఆయన పాటల్లోను కనిపించేవి. ఆయనలోని ఆ జోష్ కి మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ క్షణమే ఆయన అభిమానులుగా మారిపోయారు. వరుస అవకాశాలు .. వాటి వెనకే వినయంగా నడిచొచ్చిన విజయాలు రవితేజను స్టార్ హీరోగా నిలబెట్టేశాయి. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయడం రవితేజకి అలవాటు. గోపీచంద్ మలినేనితో మూడో సినిమాను చేస్తుండటమే అందుకు నిలువెత్తు నిదర్శనం. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ఆ చిత్రం పేరే 'క్రాక్'.

రవితేజ తన సినిమాల్లోని సందడికి .. అల్లరికి .. హడావిడికి టైటిల్ అద్దం పట్టేలా చూసుకుంటాడు. అంతేకాదు దాదాపుగా టైటిల్ క్యాచీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ సారి కూడా ఆయన అదే పద్ధతిని ఫాలో అయ్యాడు. గోపీచంద్ మలినేనితో కలిసి, పూర్తి వినోదభరితంగా 'క్రాక్' సినిమాను చేశాడు. ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా శ్రుతిహాసన్ అలరించనుంది. 'బలుపు' తరువాత ఆమె రవితేజ జోడీగా చేసిన సినిమా ఇది. అప్పట్లో తమకి 'బలుపు'తో హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని, ఈ సారి కూడా హిట్ ఇస్తాడనే నమ్మకంతో శ్రుతి హాసన్ ఉంది. తెలుగులో చాలా గ్యాప్ తరువాత చేసిన శ్రుతి హాసన్ కి ఇప్పుడు ఒక భారీ హిట్ పడవలసిన అవసరం ఉంది.

యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమాలో రవితేజ కొత్తగా కనిపించనున్నాడు. తన మార్కు ఎనర్జీని చూపించనున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. గతంలో రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన 'డాన్ శీను' .. 'బలుపు' సినిమాలు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి .. వాళ్ల చేతులమీదుగా విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సారి 'క్రాక్' తో ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలు అభిమానుల మాటగానే కాదు, ఇండస్ట్రీలోను వినిపిస్తున్నాయి.

అయితే ఇటు రవితేజకు .. అటు గోపీచంద్ మలినేనికి కొంతకాలంగా హిట్లు లేవు. ముఖ్యంగా రవితేజ వరుస పరాజయాలతో విసిగిపోయి ఉన్నాడు. అందువలన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనీ .. అదీ సంక్రాంతి బరిలోనే జరగాలనే పట్టుదలతో ఈ ఇద్దరూ ఉన్నారు. ఒకరకంగా ఇది సాహసోపేతమైన నిర్ణయమే. క్రితం ఏడాది వరకూ సంక్రాంతి అంటే, థియేటర్లను 'కామధేనువు'గా మార్చే పండుగే. పెద్ద హీరోల సినిమాలు రెండు మూడు ఒకేసారి విడుదలైనా వసూళ్లకు ఢోకా ఉండదనే ఒక భరోసా ఉండేది .. కానీ ఈ సారి పరిస్థితి వేరు.

తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. సంక్రాంతికి థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ విషయంలో ఇంకా అనుమానం .. అయోమయం నెలకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ధైర్యంగా రంగంలోకి దిగుతుండటం విశేషమే. రవితేజకి .. గోపీచంద్ మలినేనికి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడితే మంచిదే! ఈ సినిమాతో వీరు కొత్త సంవత్సరంలో తొలి హిట్ కి శ్రీకారం చుడితే మరీ మంచిదే!!