Begin typing your search above and press return to search.

ఒకే కథ .. వేరు వేరు టైటిల్స్ .. గొడవ మొదలా?!

By:  Tupaki Desk   |   5 Nov 2021 10:30 AM GMT
ఒకే కథ .. వేరు వేరు టైటిల్స్ .. గొడవ మొదలా?!
X
ఒక కథలో ఇద్దరు హీరోలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒక కథను ఒకే సమయంలో వేరు వేరు టైటిల్స్ తో ఇద్దరు హీరోలు మొదలుపెట్టడమనేది ఆశ్చర్యపోవలసిన విషయమే .. అయోమయానికి లోనుకావలసిన సంగతే. అదేంటి ఒకే కథను చేస్తున్నట్టుగా వాళ్లకి తెలియదా? అనే ప్రశ్న ఎవరిలోనైనా కలగడం సహజం. ఏ విషయమైనా అసలువాళ్లకే ఆలస్యంగా తెలుస్తుందని ఒక సామెత ఉంది. ఈ విషయంలోనూ అదే అన్వయిస్తుందని అనుకోవలసిందే. ఇంతకీ ఎవరా హీరోలు అంటే మాత్రం అటు రవితేజ .. ఇటు బెల్లంకొండ కనిపిస్తారు.

రవితేజ గడియారం ముల్లుతో పాటు పరుగులు పెడుతున్నాడు. కేలండర్ కి కూడా తెలియకుండా డేట్లు సర్దేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా థియేటర్లలో దిగిపోవడానికి 'ఖిలాడి' ఉబలాట పడుతున్నాడు. ఇక ఒక వైపు నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ'ని .. మరో వైపు నుంచి 'ధమాకా'ను చక్కబెట్టేస్తున్నాడు. ఈ సినిమాల తరువాత ఆయన ఏ బ్యానర్లో .. ఏ దర్శకుడితో చేయనున్నాడని అనుకునేలోగానే ఎనౌన్స్ మెంట్లు వదిలేశాడు. 70వ సినిమాగా 'రావణాసుర' చేయనున్నట్టుగా చెప్పేశాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టులుక్ పోస్టర్ కూడా వచ్చేసింది.

70వ సినిమాతో రౌండ్ ఫిగర్ కి చేరుకున్నాడు .. ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుతాడేమోనని అనుకునేలోగా, 71వ సినిమాగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను చేయనున్నట్టుగా చెప్పేసి షాక్ ఇచ్చాడు. 1970 - 80 దశకాలలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ఒక గజదొంగ కథ ఇది. అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇదే బయోపిక్ ను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'స్టూవర్ట్ పురం దొంగ' టైటిల్ తో చేయనున్నట్టు గతంలో ఒక పోస్టర్ కూడా వచ్చింది.

వంశీకృష్ణ ఆకెళ్ల కొంతకాలం క్రితం ఈ కథను బెల్లంకొండ శ్రీనివాస్ కి చెప్పాడు. బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదుగానీ, వంశీకృష్ణ అక్కడి నుంచి వచ్చేసి, రవితేజ హీరోగా అభిషేక్ అగర్వాల్ ను ఒప్పించాడట. అయితే వంశీకృష్ణ వెళ్లిపోయాడని బెల్లంకొండ సురేశ్ ఆ ప్రాజెక్టును ఆపలేదు. కేఎస్ అనే దర్శకుడితో దానిని ముందుకు తీసుకుని వెళుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన తాజా పోస్టర్ ను వాళ్లు కూడా నిన్ననే వదిలారు. దాంతో ఎవరూ తగ్గడం లేదనే విషయం మాత్రం అర్థమవుతోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడివరకూ వెళుతుందో .. ఏంటో!