Begin typing your search above and press return to search.

రవితేజ 70వ సినిమాగా 'రావణాసుర'

By:  Tupaki Desk   |   2 Nov 2021 2:30 AM GMT
రవితేజ 70వ సినిమాగా రావణాసుర
X
రవితేజ దూకుడు ఇప్పుడు మామూలుగా లేదు. వరుస ఎనౌన్స్ మెంట్లతో అదరగొట్టేస్తున్నాడు. ఎనౌన్స్ మెంటే కదా .. సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందిలే అనుకుంటే రవితేజ విషయంలో అది పొరపాటే. రవితేజ కొత్త సినిమా పోస్టర్ గురించి అంతా మాట్లాడుకోవడం పూర్తయ్యేలోగానే ఆయన ఆ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసేస్తున్నాడు. 'ధమాకా' విషయంలోనూ అదే జరిగింది. రవితేజ స్పీడ్ చూసి ఆయనకంటే సీనియర్ స్టార్లు .. జూనియర్ స్టార్లు కూడా షాక్ అవుతున్నారు. ఆయనను అందుకోవడానికి .. అనుసరించడానికి ప్రయత్నిస్తున్న కుర్ర హీరోలు లేకపోలేదు.

ఈ నేపథ్యంలోనే రవితేజ తన తదుపరి ప్రాజెక్టుగా 70వ సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఈ నెల 5వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకి, టైటిల్ పోస్టర్ తో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమాకి 'రావణాసుర' అనే టైటిల్ ను .. 'హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్' అనే ట్యాగ్ లైన్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. టైటిల్ చాలా పవర్ఫుల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ట్యాగ్ లైన్ కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేదిగా ఉంది. ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. సుధీర్ వర్మ అనగానే 'స్వామిరారా' .. 'దోచేయ్' .. 'కేశవ' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి.

ఈ సినిమాల్లో 'స్వామిరారా' ఆయనకి మంచి హిట్ ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆయన 'శాకిని - ఢాకిని' అనే సినిమా చేస్తున్నాడు. 'రావణాసుర' సినిమాకి అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇక ఫస్టులుక్ తో ఈ సినిమా ఏ స్థాయి బజ్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. అయితే రవితేజ - సుధీర్ వర్మ కాంబినేషన్లోని ఈ సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది. అందుకు కారణం ఆల్రెడీ రవితేజ లైన్లో పెట్టిన సినిమాలే. రవితేజ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఖిలాడి' రెడీ అవుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఇక 'ఖిలాడి' తరువాత రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్నాడు. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగును పూర్తి చేసుకుంది. ఇక ఆ తరువాత సినిమాగా ఆయన 'ధమాకా' చేస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ షూటింగు పూర్తి చేసుకుని, సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగు కూడా కాస్త దార్లో పడగానే, రవితేజ 'రావణాసుర' పట్టాలెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.