Begin typing your search above and press return to search.

నిఖిల్ పెళ్లి ఆమెకు నచ్చలేదు..పంచులేసింది!

By:  Tupaki Desk   |   17 April 2020 2:57 PM GMT
నిఖిల్ పెళ్లి ఆమెకు నచ్చలేదు..పంచులేసింది!
X
దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. చావు పరామర్శకు వెళ్లి జబర్దస్త్ జోకులు చెప్పి వెకిలిగా నవ్వకూడదు. అలాగే శుభకార్యం జరిగే చోట చావు ఏడుపులు ఏడవకూడదు. అలానే దేశం అంతా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సమయంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుటుంబంలో పెళ్లి జరిగితే అది తప్పనిసరిగా విమర్శలకు దారితీస్తుంది. ఈరోజు జరిగిన నిఖిల్ కుమారస్వామి వివాహంపై అలానే విమర్శలు వస్తున్నాయి.

దేవెగౌడ మనవడు - కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్ గౌడ పెళ్లి ఈరోజు మాజీ కర్ణాటక మంత్రి కృష్ణప్ప కుమార్తె రేవతితో జరిగింది. అసలు లాక్ డౌన్ సమయంలో పెళ్లికి అనుమతి ఇవ్వడమే సరికాదని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఈ పెళ్లిపై బాలీవుడ్ నటి రవీనా టాండన్ ట్విట్టర్ ద్వారా పంచులు విసిరారు.

"వీరికి తెలియదేమో.. దేశంలో చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లలేక ఇతర ప్రదేశాలలో చిక్కుకున్నారు. చాలామంది ఆకలితో ఉన్నారు. ఇతరులేమో ఈ సమస్య నుండి బయట పడేందుకు తమవంతు సాయం చేస్తున్నారు. ఆ బఫె లో ఏం వడ్డించారో మరి.. #సోషల్ డిస్టెన్సింగ్" అంటూ ట్వీట్ చేసింది. అనుమతించిన వారికంటే ఎక్కువమంది పెళ్లిలో పాల్గొన్నారని.. లాక్ డౌన్లో పాటించాల్సిన భౌతిక దూరం నియమాన్ని పాటించలేదని.. కొన్ని ఇతర నియమాలను కూడా ఉల్లంఘించారని వార్తలు వస్తున్నాయి. చాలామంది నెటిజన్లు రవీనాకు మద్దతుగా నిలుస్తూ కుమారస్వామి కుటుంబం తీరును తప్పు పడుతున్నారు.