Begin typing your search above and press return to search.

ఆదిపురుష్‌.. రావ‌ణాసురుడిని దాచేయ‌డం వ్యూహాత్మ‌క‌మా?

By:  Tupaki Desk   |   7 Jun 2023 9:21 AM GMT
ఆదిపురుష్‌.. రావ‌ణాసురుడిని దాచేయ‌డం వ్యూహాత్మ‌క‌మా?
X
చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుప‌తిలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేదిక‌పై శ్రీ‌రామ్ పాత్ర‌ధారి ప్ర‌భాస్.. సీత పాత్ర‌ధారి కృతి స‌నోన్.. ల‌క్ష్మ‌ణుడు స‌న్నీసింగ్.. ఆంజనేయుడు దేవ్ ద‌త్తా అంతా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. కానీ లంకేష్ (రావ‌ణుడు) పాత్రను పోషించిన సైఫ్ అలీఖాన్ వేదిక‌పై మిస్స‌య్యాడు. రావ‌ణుడు మిస్స‌వ్వ‌డంపై అభిమానులు పరిశ్రమలో ర‌క‌ర‌కాల‌ ఊహాగానాలకు దారితీసింది. నెటిజ‌నుల్లో దీనిపై చ‌ర్చా కార్య‌క్ర‌మం సాగింది.

సైఫ్ అలీ ఖాన్ గైర్హాజరుపై అభిమానులు మరియు ఔత్సాహికుల్లోని ఒక వర్గం నిరాశను వ్యక్తం చేసింది. టాలీవుడ్ ఆరంగేట్ర చిత్రం కావ‌డంతో అతడు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌చారానికి వ‌స్తాడ‌ని అంతా భావించారు. కానీ అత‌డు రాలేదు. అంతేకాదు యంగ్ య‌మ ఎన్టీఆర్ తో `దేవర` లాంటి భారీ చిత్రానికి సైఫ్ ఖాన్ సంత‌కం చేసాడు కాబ‌ట్టి ఈ వేదిక‌పై క‌నిపించి ఇటు ప్ర‌భాస్ అభిమానులు అటు ఎన్టీఆర్ అభిమానుల‌ను ఖుషీ చేస్తాడ‌నే భావించారు.

ఇక ఈ వేదిక‌పై క‌నిపించి ఉంటే సైఫ్ ఖాన్ సినిమాల‌కు తెలుగు మార్కెట్ కూడా పెరుగుతుంది క‌దా? అని కొంద‌రు విశ్లేషించారు. అత‌డి వ‌ల్ల ఉత్తర భారత మార్కెట్ లో ఆదిపురుష్ కి హైప్ పెరుగుతుంది. కానీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సైఫ్ అలీ ఖాన్ గైర్హాజరు రక‌ర‌కాల‌ ప్రశ్నలను లేవనెత్తింది. అయితే కొంద‌రి విశ్లేష‌ణ ప్ర‌కారం ఇదంతా వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌. నిజానికి రామాయ‌ణ క‌థ‌లో రావ‌ణుడు అత్యంత శ‌క్తివంత‌మైన వాడు. రాక్ష‌స‌రాజు అరివీర ప‌రాక్ర‌ముడు. అత‌డిని వేదిక‌ల‌పై హైలైట్ చేసినా లేదా ట్రైల‌ర్ల‌లో అధికంగా హైలైట్ చేసినా ప్ర‌మాదం పొంచి ఉంది. రాఘ‌వ‌ను త‌క్కువ చేస్తే ప్ర‌భాస్ అభిమానుల‌కు అది న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి ఎన్నో సెన్సిటివ్ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకునే సైఫ్ ని కానీ సైఫ్ పాత్ర‌ను కానీ వ్యూహాత్మ‌కంగా ప‌రిమితంగా చూపిస్తున్నార‌ని విశ్లేషిస్తున్నారు.

అయితే ఉత్త‌రాదిన ప్ర‌భావ‌వంతంగా ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు రావాలంటే సైఫ్ ఖాన్ అక్క‌డ ప్ర‌చారానికి పూనుకోవాలి. ఉత్త‌ర భార‌తంలో అసాధార‌ణ‌మైన ఫాలోయింగ్ ఉన్న సైఫ్ ఖాన్ హిందీ మీడియా ప్ర‌చారంలో ఎంత చురుగ్గా ప‌ని చేస్తాడో చూడాలి. భార‌తీయ పురాణేతిహాస‌నం రామాయ‌ణం ని నేటి అధునాత‌న టెక్నాల‌జీతో ఒక విజువ‌ల్ వండ‌ర్ గా ఓంరౌత్ రూపొందించాడ‌ని ట్రైల‌ర్లు ప్రూవ్ చేసాయి. ఈ రెండు ట్రైల‌ర్ల‌తో అంచ‌నాలు పెరిగాయి. జూన్ 16 విడుద‌ల కోసం ఇప్పుడు ప్ర‌జ‌లు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. ప్రీరిలీజ్ వేడుకను అసాధార‌ణ స్థాయిలో అత్యంత భారీగా ప్లాన్ చేయ‌డం చూస్తుంటే ఇది సినిమాపై హైప్ ను పెంచే ప్ర‌క్రియ అని కూడా అర్థ‌మ‌వుతోంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ అభిమానుల్లో టెన్ష‌న్ పెరుగుతోంది. ప్రీరిలీజ్ వేదిక వ‌ద్ద కాషాయ చొక్కాలతో కాషాయ జెండాల‌తో ప్ర‌త్య‌క్ష‌మై జై శ్రీ‌రామ్ నినాదాల‌తో హోరెత్తించారు. థియేట‌ర్ల వ‌ద్ద కూడా ప్ర‌భాస్ అభిమానులు ఇదే తీరుగా కాషాయంతో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతార‌ని కూడా భావిస్తున్నారు.