Begin typing your search above and press return to search.

ఎంతపని చేశావయ్యా డైమండ్ బాబూ!

By:  Tupaki Desk   |   17 Feb 2022 2:30 PM GMT
ఎంతపని చేశావయ్యా డైమండ్ బాబూ!
X
టాలీవుడ్ లోకి రచయితలుగా అడుగుపెట్టేసి .. తమ ప్రత్యేకతను చాటుకున్న తరువాత దర్శకులుగా మారినవారు కొంతమంది కనిపిస్తారు. త్రివిక్రమ్ .. కొరటాల .. అనిల్ రావిపూడి ఆ జాబితాలో మనకి కనిపిస్తారు. తాజాగా ఆ బాటలోనే డైమండ్ రత్నబాబు కూడా మెగా ఫోన్ పట్టేశాడు. ఇంతకుముందు డైమండ్ రత్నబాబు డైలాగ్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. మోహన్ బాబు సినిమాలకి పనిచేసి ఆయనతో శభాష్ అనిపించుకున్నాడు. ఆయన కథానాయకుడిగా 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకి దర్శకత్వం వహించాడు.

మంచు విష్ణు తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా, రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ పొరపాటుగా ఒక మాట అనేశారు.

మాటల రచయిత .. ఆయనకి మాట్లాడటం రాదని కాదుగానీ, ఫ్లోలో ఒక మాట మాత్రం అనేశాడు. ఈ సినిమాను ఓటీటీ కోసం తీశామనీ .. ఓటీటీ ద్వారానే రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నామని అన్నాడు. అయితే ఆ తరువాత మనసు మార్చుకుని ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని వస్తున్నట్టుగా చెప్పాడు.

సాధారణంగా ఎవరైనా తమ సినిమాకు ఓటీటీ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ థియేటర్లలో రిలీజ్ చేయాలనే పట్టుదలతో వెయిట్ చేసి మరీ వస్తున్నట్టుగా చెబుతుంటారు. ఎందుకంటే ఇది థియేటర్లలో ఎంజాయ్ చేయవలసిన కంటెంట్ అంటూ ఉంటారు. కానీ ఆ లాజిక్ కు పక్కన పెట్టేసి డైమండ్ రత్నబాబు మాట్లాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓటీటీ కోసం తీశాము అనగానే ఆ సినిమా క్వాలిటీ విషయంలో ఆడియన్స్ ఆలోచన మారిపోతుంది. మరి ఈ విషయాన్ని ఆయన ఎలా మరిచిపోయాడనేది ఆశ్చర్యమే.

ఇక 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా విషయానికి వస్తే, మొదటి నుంచి కూడా ఈ సినిమాను మోహన్ బాబు వైపు నుంచే హైలైట్ చేస్తూ వస్తున్నారు. కథ ఆయన చుట్టూనే తిరుగుతుంది కనుక అది కొంతవరకూ ఓకే. కానీ ఆయన తప్ప సినిమాలో ఎవరూ లేరా? ఏమీ లేదా? అనే ఆలోచన ప్రేక్షకులకు రాకూడదు.

మోహన్ బాబు కాకుండా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ .. అలీ .. పోసాని .. సునీల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఒక వైపున మోహన్ బాబు ఉంటే అందుకు సమానంగా మరో వైపున నిలబడేంత బరువు ఈ పాత్రలకు లేదనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందనేది రేపు తేలిపోతుంది.