Begin typing your search above and press return to search.

రామ్ ని కూడా వదిలేది లే అంటున్న రష్మిక!

By:  Tupaki Desk   |   15 March 2022 3:30 PM GMT
రామ్ ని కూడా వదిలేది లే అంటున్న రష్మిక!
X
యాక్షన్ చెప్పినప్పుడు తప్ప రష్మిక ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటుంది. తెరపైనే కాదు బయట కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. అంతెందుకు ఎయిర్ పోర్టులో కూడా అమ్మడు తిన్నగా నడవదు .. ఏవో స్టెప్పులు వేస్తూనే ఉంటుంది.

ఇంత చురుకుగా ఉండటం వల్లనే ఇతర హీరోయిన్లు ఆలోచించుకుని ఓకే చెప్పేలోగానే ఆ ఛాన్స్ రష్మిక ఖాతాలోకి చేరిపోతుంటుంది. తేనె చల్లిన తెల్ల మందారంలా కనిపించే ఈ బ్యూటీ, వరుస అవకాశాలను కొల్లగొడుతూ టాలీవుడ్ లో తన రాజ్య విస్తరణ పనులను ముమ్మరంగానే కొనసాగిస్తోంది.

ఇప్పటికే నాగశౌర్య .. విజయ్ దేవరకొండ .. నితిన్ .. శర్వానంద్ వంటి యంగ్ స్టార్ హీరోలతో జోడీ కట్టిన రష్మిక, రామ్ చేసిన పాపం మాత్రం ఏవుంది? ఆయనతో కూడా ఓ నాలుగు డ్యూయెట్లు వేసుకుందాం అన్నట్టుగా రెడీ అవుతోంది.

ఆయనతో బోయపాటి చేయనున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రామ్ 'ది వారియర్' సినిమాను చేస్తున్నాడు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా రామ్ కనిపించనున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగిపోతున్నాయి. ఈ సినిమా కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన బోయపాటి, చివరికి రష్మికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

బోయపాటి చెప్పిన కథ వినగానే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి అవసరమైన ఇతర నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో బోయపాటి ఉన్నట్టుగా చెబుతున్నారు.

ప్రస్తుతం లింగుసామితో రామ్ చేస్తున్న సినిమా ఏప్రిల్లో పూర్తి కానుంది. ఆ తరువాత బోయపాటి సినిమా పట్టాలెక్కనుంది. తెలుగులో నెంబర్ వన్ ప్లేస్ కోసం పూజ హెగ్డేతో పాటీ పడుతున్న రష్మిక, కన్నడలోను స్టార్ హీరోయిన్స్ కేటగిరీలోనే జెండా ఎగరేస్తోంది.

'పుష్ప'తో హిట్ కొట్టిన ఆమె వచ్చే నెల నుంచి 'పుష్ప 2' షూటింగులో బిజీ కానుంది. ఇక తమిళ .. హిందీ భాషల్లోను పట్టు సాధించాలనే పట్టుదలతో ఉంది. త్వరలో హిందీలో రిలీజ్ అవుతున్న రష్మిక సినిమాలు ఆమె ఆశలను నిజం చేస్తాయేమో చూడాలి.