Begin typing your search above and press return to search.

కోలుకున్న వెంట‌నే ఫ్యాన్స్ ముందుకొచ్చిన హీరో

By:  Tupaki Desk   |   19 Dec 2021 9:49 AM GMT
కోలుకున్న వెంట‌నే ఫ్యాన్స్ ముందుకొచ్చిన హీరో
X
గ‌తంతో పోలిస్తే మ‌న హీరోలు ప్ర‌స్తుతం వున్న పోటీ కార‌ణంగా ప్రేక్ష‌కుల్ని ప్రస‌న్నం చేసుకోవ‌డం కోసం ఎలాంటి ప్ర‌మాద‌ర స్టంట్‌లు చేయ‌డానికైనా సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో గాయాల పాల‌వుతున్నారు. అయినా ప్ర‌మాదాలుకు బెద‌ర‌డం లేదు. ప్ర‌యోగాలు చేయ‌డానికి వెర‌వ‌డం లేదు. త‌మ‌ని ప్ర‌మాదాలు ప‌ల‌క‌రించినా తేరుకున్న వెంట‌నే అభిమానుల ముందుకు వ‌చ్చేస్తున్నారు. తాజాగా ఉస్తాద్ ఎన‌ర్జిటిక్ రామ్ కూడా ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించి అభిమానుల ముందుకొచ్చారు. ఫ్యాన్స్ అంద‌రికి తాను క్షేమంగానే వున్నానని తెలియ‌జేస్తూ వారిలో నెల‌కొన్న భ‌యాల్ని పోగొట్టే ప్ర‌య‌త్నం చేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. వివ‌రాల్లోకి వెళితే.. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ప్ర‌స్తుతం యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం మ‌రింత ఫిట్ గా క‌నిపించాల‌ని రామ్ చేసి హెవీ వ‌ర్క‌వుట్స్ తో రామ్ నెక్ కి గాయ‌మైంది. దీంతో లింగు స్వామి సినిమా షూటింగ్ ని నిర‌వ‌ధికంగా ఆపేశారు. ఇదే విష‌యాన్ని తెలియ‌జేస్తూ హీరో రామ్ నెక్ బ్యాండ్ ధ‌రించిన ఓ ఫొటోని షోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసి అబిమానుల‌తో పంచుకున్నారు. దీంతో ఆయ‌న ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

త‌మంతా అభిమానించే హీరో త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్థ‌న‌లు చేశారు. తాజాగా కోలుకున్న హీరో రామ్ వెంట‌నే అభిమానుల ముందుకొచ్చారు. ఈ రోజు అంటే ఆదివారం జ‌రిగిన క్యాలెండ‌ర్ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానుల ముందుకొచ్చిన రామ్ వారికి అభివాదం చేస్తూ సంద‌డి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో 2000 మంది అభిమానులు పాల్గొన్నారు. త‌ను కోలుకోవ‌డానికి ప్రార్థించిన అభిమానులంద‌రికీ ఈ సంద‌ర్భంగా రామ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

రామ్ కోలు కోవ‌డంతో #RAPO19 త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది.

లింగు స్వామి అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురానున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని జ‌న‌వ‌రి 5 నుంచి ప్రారంభించ‌బోతున్నారు. ఈ విష‌యం తెలిసి రామ్ అభిమానులు ఊప‌రి పీల్చుకున్నారు.